Reading Time: < 1 minute

మంగళూరు పోర్టుకు చేరుకున్న ‘పైక్సిస్ పయనీర్’

మంగళూరు : భారత్‌కు మరింత ఊరటనిచ్చే విషయం. అమెరికా నుంచి భారీ పరిమాణంలో ఎల్‌పిజితో కూడిన కార్గో నౌక ఆదివారంనాడు ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకుంది. పైక్సిస్ పయనీర్ అనే నౌక సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజితో పోర్టుకు చేరుకుంది. దక్షిణ భారతదేశంలోని గృహ, పారిశ్రామిక అవసరాలకు ఇది మరింత సాయపడనుంది. భారత్‌కు సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ దిగుమతులు అత్యధికం. తాజాగా పశ్చిమాసియా పరిణమాల నేపథ్యంలో అమెరికా నుంచి నేరుగా భారీ నౌక రావడం ఇంధన వనరుల వైవిధ్యీకరణలో భాగంగా భావిస్తున్నారు. మంగళూరు పోర్ట్ ద్వారా అన్‌లోడ్ చేసే ఈ గ్యాస్‌ను పైప్‌లైన్లు, ట్యాంకర్ల ద్వారా కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు అస్థిరంగా ఉన్న వేళ, ఇలాంటి భారీ దిగుమతులు స్థానిక మార్కెట్లో ఎల్‌పిసి ధరలు అదుపులో ఉండటానికి దోహదపడతాయి.