Reading Time: < 1 minute

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ జలసంధి విషయంలో వెనక్కి తగ్గింది. హార్ముజ్‌ మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. ‘భద్రతా’ ఏర్పాట్ల కోసం ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే విదేశీ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ అధికారి తెలిపారు. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని ఇరాన్ కండీషన్ పెట్టింది.

అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO)లో ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి మాట్లాడుతూ.. టెహ్రాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని అన్నారు. సముద్ర భద్రతను పెంపొందించడానికి, నావికులను రక్షించడానికి ప్రపంచ సంస్థలు, ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు. “దౌత్యం ఇరాన్‌కు ప్రాధాన్యతగా ఉంటుంది. అయితే, దురాక్రమణను పూర్తిగా నిలిపివేయడం, అలాగే పరస్పర విశ్వాసం, నమ్మకం మరింత ముఖ్యం. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులే..పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, హోర్ముజ్ జలసంధిలోని ప్రస్తుత పరిస్థితికి మూల కారణం” అని ఆయన పేర్కొన్నారు.

కాగా.. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించాలని.. లేకపోతే ఇరాన్ ఇందన కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ ఆదివారం తీవ్ర హెచ్చరికలు చేశారు. మరి, ఇరాన్ పూర్తిస్థాయిలో జలసంధిని ఓపెన్ చేయకపోవడంపై ట్రంప్ ఎలా స్పందిస్తాడనేది చర్చనీయాంశంగా మారింది.