Reading Time: < 1 minute

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎపిలోని అనకాపల్లి బిజేపి ఎంపి సిఎం రమేష్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో ఆదివారం తన అనుచరులతో హల్‌చల్ చేశారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీకి చెందిన వివాదాస్పద స్థలంలోకి వచ్చి హంగామా సృష్టించాడు. సర్వే నంబర్ 129లో ప్లాట్ నంబర్ 29,30లోని భూమిని కొనుగోలు చేసిన శివనారాయణ అనే వ్యక్తి పొజిషన్‌లో ఉన్నాడు. దీనిపై సిఎం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2006 నుంచి సిఎం రమేష్ తమను ఇబ్బంది పెడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తమ భూమిలోకి ఎవరూ ఎంటర్ కావద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా సిఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదులు చేశారు. సిఎం రమేష్, శివనారాయణ ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ సుహాసన్ తెలిపారు.