
పెరుగుతోన్న రియల్ మోసాలు
మోసపోయి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన టెకీ
ప్రభుత్వ భూములను వదలని రియల్టర్లు
వాటిని చూపించి కోట్లు దోచుకున్న వ్యాపారులు
మనతెలంగాణ / సిటిబ్యూరోః రియల్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రీలాంచ్, ఆఫర్ల పేరిట కొందరు రియల్ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటూ చేతులు ఎత్తివేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ ధరకే ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామని తక్కువ ధరకే ఇస్తామని ప్రకటించి అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు అప్పులు, బ్యాంక్‌ల్లో రుణాలు తీసుకుని ముట్టజెప్పి నిండామునుగుతున్నారు. ఇలాంటి కేసులు హైదరాబాద్ మహానగరంలోని పోలీస్ స్టేషన్లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలా వరకు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, కొన్ని కేసుల్లో సివిల్ వివాదం పేరుతో మోసాలు చేస్తున్నవారిపై కేసులు పెట్టడంలేదు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రీలాంచ్ పేరుతో చాలా రియల్ ఎస్టేట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. సాహితీ ప్రీలాంట్ పేరుతో పలువురి వద్ద నుంచి రూ.3వేల కోట్లు వసూలు చేసింది, డబ్బులు కట్టి ఏళ్లు అవుతున్నా కూడా కనీసం పునాది కూడా వేయకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జయత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రీలాంచ్ పేరుతో పలువురి వద్ద నుంచి వందల కోట్లు వసూలు చేసింది. తక్కువ డబ్బులకు ఫ్లాట్ కట్టిఇస్తామని చెప్పడంతో ఏడేళ్ల క్రితం పలువురు బాధితులు లక్షలాది రూపాయలు కట్టారు. సాఫ్ట్‌వేర్ ఇంజీనర్లు, వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగులు లక్షలాది రూపాయలు కట్టారు.
ప్రైం లొకేషన్‌లో ఫ్లాట్లను కట్టుతున్నట్లు చెప్పడంతో చాలామంది బాధితులు తక్కువ ధరకు వస్తున్నాయని భావించి డబ్బులు కట్టారు. డబ్బులు వసూలు చేసిన రియల్ వ్యాపారులు వారు చెప్పిన ప్రాంతంలో పిల్లర్లు వేసి వదిలేశారు. డబ్బులు కట్టి సంవత్సరాలు అవుతున్నా పనులు ముందుకు సాగకపోవడంతో బాధితులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన నిందితులు చెల్లని చెక్కులు ఇచ్చి చేతులుకు దులుపుకున్నారు. బాధితులు చెక్కులను బ్యాంక్‌లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి, మళ్లీ పోలీసులను బాధితులను సంప్రదించడంతో సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈవికే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మోకిలాలో తక్కువ ధరకు విల్లాలు కట్టిస్తామని చెప్పడంతో చాలామంది బాధితులు లక్షలాది రూపాయలు కట్టారు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితులు కనీసం భూమి కూడా కొనుగోలు చేయలేదు, కాని ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి చేతులు ఎత్తివేశారు. తక్కువ ధరకు విల్లా వస్తుందని భావించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.50లక్షలు కట్టాడు, ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో నిండామునిగాడు. వేతనంపై బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేసి రూ.50లక్షలు కట్టాడు, దీనికితోడు ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో మోసపోయాడు.
అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు ఉద్యోగం పోవడంతో నిండామునిగాడు, అప్పులు తీర్చేందుకు రాత్రి సమయంలో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భారతీ లేక్ వ్యూ ప్రాజెక్ట్ పేరుతో ప్రీలాంచ్‌కు తెరలేపిన భారతీ బిల్డర్స్ 350మంది నుంచి 80కోట్ల రూపాయలు వసూలు చేసి నిండాముంచారు. హైదరాబాద్, మాదాపూర్‌కు చెందిన దూపటి నాగరాజు భారతీ బిల్డర్స్ చైర్మన్, ముల్‌పూరి శివరామకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్‌గా 2021లో భారతీ బిల్డర్స్‌ను మాదాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఇద్దరు కలిసి కొంపల్లిలో 6.23 ఎకరాలను అపార్ట్‌మెంట్లు కట్టేందుకు కొనుగోలు చేశారు. భారతీ లేక్ వ్యూ పేరుతో అపార్ట్‌మెంట్లు కడుతున్నామని చెప్పి ప్రీ లాంచ్ పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 350మంది నుంచి రూ.80కోట్లు వసూలు చేశారు. బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత భూమిని వేరే వారికి రూ.100కోట్లకు విక్రయించారు. భారతీ బిల్డర్స్ తమ వద్ద డబ్బులు వసూలు చేసి రెండేళ్లు అవుతున్నా కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎపిలోని చిత్తూరూ జిల్లా, రేణిగుంటకు చెందిన ఓబిలి పాపనగిరి రామాచంద్రారెడ్డి ఓబిలి హౌసింగ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట్ మండలం, వెంకటాపురంలో హైవే ప్యారడైజ్ పేరుతో 200 ఎకరాల్లో వెంచర్‌ను ప్రారంభించారు.
ప్రీలాంచ్ పేరుతో పలువురు అమాయకుల వద్ద నుంచి మూడేళ్లలో 50మంది రూ.10 నుంచి రూ.15కోట్లు వసూలు చేశాడు. ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన గుంటుపల్లి శ్రీనివాస రావు మరో ఇద్దరితో కలిసి జిఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేశారు. కోల్లూరులో తక్కువ డబ్బులకు విల్లాలు, అపార్ట్‌మెంట్లు కట్టిస్తామని ప్రీలాంచ్ విల్లా పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. నిందితులు బ్రోచర్లు ముద్రించి పలువురికి పంపిణీ చేశారు. వాటిని చూసిన 31మంది బాధితులు వీరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేశారు. మూడేళ్లలో విల్లా కట్టి ఇస్తామని చెప్పారు, ఒకవేళా సమయానికి కట్టకుంటే 24శాతం వడ్డీ కలిసి డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలామంది డబ్బులు ఇచ్చారు, కోట్లాది రూపాయలు తీసుకున్న నిందితులు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలు కట్టిస్తామని చెప్పి బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితులు నిండాముంచారు. రియల్ మోసాలకు బలైన బాధితులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు.
ఒప్పందాలు చేసుకుని…
రియల్ మోసాలు చేస్తున్న నిందితులు భూమి యజమానులకు కొంత డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ పత్రాలను బాధితులకు చూపించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఒప్పందాలను రద్దు చేసుకోవడం లేదా భూమిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించి రెండు విధాలుగా సొమ్ము చేసుకుంటున్నారు. భారతీ బిల్డర్స్ బాధితులకు ప్రభుత్వ భూమిని తమదిగా నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి మోసం చేశారు. చాలా కేసుల్లో ఒప్పందాలు రద్దు చేసుకుని ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంలేదు.
అందమైన బ్రౌచర్లు…
ప్రాజెక్ట్‌లు ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ సంస్థలు అందంగా బ్రౌచర్లు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. తాము చేపట్టబోయే అపార్ట్‌మెంట్లు ఇలాగే ఉంటాయని చెప్పడంతో చాలా మంది ఆకర్షితులై డబ్బులు కడుతున్నారు. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండాలని ఆశతో డబ్బులు కడుతున్నారు. ప్రజల ఆశల గ్రహిస్తున్న నిందితులు డబ్బులు వసూలు చేసి నిండాముంచుతున్నారు. సాహితీ, భారతీ సంస్థలు ఏకంగా ప్రభుత్వ భూములను చూపించి డబ్బులు వసూలు చేశాయి. అంతేకాకుండా హైరైజ్ బిల్డింగ్‌లు ఇప్పుడు ఫ్యాషన్ కావడంతో వాటిని చూపించి డబ్బులు దోచుకున్నారు.
కేసు పెట్టినా లాభంలేదు…
రియల్ మోసాల కేసులో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా బాధితులకు ఎలాంటి న్యాయం జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసినా కూడా వారి నుంచి డబ్బులు రికవరీ చేయలేకపోవడంతో బాధితులకు నయాపైసా కూడా రావడంలేదు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఒక్క బాధితుడికి కూడా డబ్బులు రికవరీ కాలేదు. కోర్టుల్లో కేసులు కొనుసాగుతున్నాయి కానీ బాధితులకు న్యాయం జరగడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.