
గాడిద గుడ్డు
గాడిద ఎక్కడన్నా గుడ్డు పెడుతుందా? అంటే అది పిల్లలను మాత్రమే కంటుంది.. కానీ గుడ్డు గాడిద గుడ్డు అనేది ఒక జాతీయంగా తెలుగులో స్థిరపడిపోయింది.. ఇది ఒక సెటైరికల్ గా వాడే పదంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం అనేది గత 40 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రవేశపెట్టబడి ఎన్నో అంతర్జాతీయ సంస్థల అభినందనలు అందుకని వాటి సహకారంతో కూడా కొన్నాళ్ళు అంగన్వాడీల ద్వారా నడిచింది.. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దానిని గుర్తించి పిల్లల స్కూల్ డ్రాప్ అవుట్ లు తగ్గించడానికి సహాయపడుతుంది అని దానిని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో ఉన్నారు అని యూనిసెఫ్ సంస్థ చాలా దేశాలలో గుర్తించింది. అందులో మన దేశం కూడా ఒకటి.. దీనిని ఎదుర్కొనడానికి ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా ఒక చిన్న ప్రయత్నం అంతేకానీ అదే సమాధానం కాదు..
ఆ గుడ్లు సరిగ్గా ఉడకలేదని అసహనమో? లేక ఉపాధ్యాయులకు ఆ పని అప్ప చెప్పడం వలన వారు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అని అసహనమో? తెలియదు కానీ ఏదో చెప్పాలని మరేదో అన్నారు. గుడ్డు గాడిద గుడ్డుతో ఆగింటే అదొక జాతీయంగా ఆగిపోయిండేది కానీ శోభనము పెళ్ళికొడుకుల ఇక మాట వింటాడా? అని అనడంతో అది అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.. ఈ మధ్యన ఎందుకో ఆయన ఎక్కువగా వివాదాస్పదమైన వ్యాఖ్యలతో మాట తూలుతున్నారు. తిండి విషయంలో ఒకసారి, లేదా రాష్ట్రం పేరు మార్చాలి అని మరొకసారి, ఇక ఆడవాళ్ళ వస్త్రధారణ పైన అనేకసార్లు, చిరంజీవి గారి పైన కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఈ మధ్యన వార్తలలో ఉంటున్నారు.
దానికి తోడు ఈ గుడ్డు వ్యవహారం అనవసరమైన వ్యవహారం గా ఆయన మెడకు చుట్టుకుంది. మాడుగుల నాగఫణి శర్మ లాంటి అష్టావధానులు ఎప్పుడు కూడా ఇటువంటి వివాదాలలో చిక్కుకోలేదు. వారు కూడా అష్టావధానంలో అధిక ప్రసంగం అని ఒకటి ఉంటుంది అందులో కూడా సరస చలోక్తులకు వదులుతూ ఉంటారు. అలా వ్యంగంగా మాట్లాడడం కవులకు కామన్ అయినప్పటికీ ఎందుకో ఈ గుడ్డు విషయంలో వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది.
చాలామంది వ్యక్తులకు, సంస్థలకు ప్రయోజనం ఉన్నప్పుడు, చాలా మంది విద్యార్థులకు దీనివలన ప్రయోజనం కలిగి ఉన్నప్పుడు, దీనివలన మాల్ న్యూట్రిషన్న్ తగ్గించే ఒక మంచి ఆలోచన ప్రభుత్వం ద్వారా జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయం మాట్లాడకుండా ఉండడం, ఒకవేళ ఉపాధ్యాయుల పనితీరు దీని వలన తగ్గుతుంది అని అనుకుంటే సూటిగా సమస్య గురించి చెప్పి ఉంటే బాగుండేది..
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥
భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.
చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశిచునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాలా కేశాలంకరణలూ పురుషునికి నిజమైన అలంకరణలు కా జాలవు.
వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకారప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.
మీరేమంటారు?
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు