
‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా’
ఎక్స్ వేదికగా సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి సిఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్ కర్మాగారం సిఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి వెళ్లే ముందు ‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని’ సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదనీ, కేవలం 17 నెలల వ్యవధిలో ఫామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.