Reading Time: 2 minutes

డిమోనా, అరాద్ నగరాలపై క్షిపణులు

ఘటనలపై తొలిసారి నెతన్యాహు ఆందోళన

అరాద్ విధ్వంస ప్రాంతాలలో పర్యటన

ఖతార్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

హర్మూజ్‌పై ట్రంప్ హెచ్చరికలు

ఓపెన్ చేసేందుకు 48 గంటల గడువు

ఇజ్రాయెల్ సైన్యం నుంచి వైఫల్య అంగీకారం

భారతీయ సంతతి మినీ ఇండియాలో కలకలం

టెహరాన్ : ఇరాన్ తమ శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులతో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంపై దాడికి దిగింది. ఇక్కడ ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన నెగెవా అణు పరిశోధనా కేంద్రం నెలకొని ఉంది. అంతకు ముందు ఇజ్రాయెల్, అమెరికా సేనలు ఇరాన్‌కు చెందిన ప్రధానమైన నతాంజ్ అణు శుద్ధి కేంద్రం కాంప్లెక్స్‌పై దాడికి దిగింది. దీనికి ప్రతీకారంగానే వెంటనే ఇరాన్ క్షిపణులు డిమోనాను లక్షంగా చేసుకున్నాయి. అయితే నతాంజ్ అణుస్థావరంపై తమ సేనలు దాడి జరపలేదని ఇజ్రాయెల్ ప్రకటన వెలువరించింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డట్లు ప్రాధమిక సమాచారం మేరకు వెల్లడైంది. ఈ నగరంలో అత్యధిక సంఖ్యలో అత్యధిక సంఖ్యలో భారతీయ సంతతి వారు ఉండటంతో దీనిని మినీ ఇండియా అని పిలుస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం వీరు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.

30 శాతం మందికి పైగా భారతీయ సంతతివారు, ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన వారు నివసిస్తున్నారు. ఇరాన్ క్షిపణులు ఎక్కువగా నివాసిత ప్రాంతాలనే దెబ్బతీశాయని వెల్లడైంది. ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర వైద్య సేవల విభాగం మాగెన్ డేవిడ్ ఆడం (ఎండిఎ) ఈ ప్రాంతంలో నుంచి దాదాపు వంద మందిని అత్యవసర చికిత్సలకు ఆసుపత్రులకు తరలించింది. ఈ అణు కేంద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన అణ్వాయులు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటి దాడులలో అణుధార్మికత ఏదైనా వెలువడలేదని, ప్రజలకు పర్యావరణానికి ముప్పు లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన మరో నగరం అరాద్‌పై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. డిమోనాపై దాడుల సమయంలోనే ఇక్కడ కూడా క్షిపణులు విరుచుకుపడ్డాయి.

ఇరాన్ దాడులు జరిగిన అరాద్ నగరాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహూ ఆదివారం సందర్శించారు. ఇరాన్ అత్యంత శక్తివంతంగా తన అణుపాటవం పెంచుకుంది. చివరికి యూరప్‌లోని ప్రాంతాలకు, హిందూ మహాసముద్రంలోని స్థావరాలకు కూడా ముప్పు తెచ్చిపెట్టగలదు. డిగో గార్షియా వంటి చోట్ల జరిగిన దాడి ఇందుకు నిదర్శనం అని తెలిపిన నెతన్యాహు అమెరికా, ఇజ్రాయెల్‌లు మొత్తం ప్రపంచం కోసం పోరుకు దిగాయని స్పందించారు. మొత్తం ప్రపంచానికి ఇరాన్ నుంచి ముప్పు ఏర్పడిందని తెలిపారు. అణు కేంద్రాలపై దాడుల పేరిట పౌరులను బలి తీసుకుంటున్నారని అరాద్, డిమోనాపై ఇరాన్ ఖండాంతర క్షిపణుల ఘటనలను ప్రస్తావించారు.