Reading Time: < 1 minute

నర్మెట: ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాకర్టీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి విడుతలో రూ.3,600 కోట్లను విడుదల చేశారు. విడుదల చేసిన మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమా అవుతుంది. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో మాత్రం వెనుకంజ వేయటం లేదని అన్నారు. ఆర్థిక సమస్యలు అభివృద్ధికి అవరోధంగా మారాయని తెలిపారు. రైతుభరోసా నిధులను మొత్తం మూడు విడతల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

45 రోజుల్లో 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు వేయనున్నట్లు సిఎం తెలిపారు. ‘‘రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి, రుణమాఫీ కూడా చేశాం. వరికి బోనస్ ఇస్తున్నాం. వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నాం. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ ప్రాంతం నిజాం కాలంలోనే వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగా ఉండేది. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లా పంటల సాగు తగ్గింది. కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం 50 లక్షల టన్నుల వరి మాత్రమే కొంటామని చెప్తోంది. పంట మార్పిడి ద్వారా మాత్రమే.. వ్యవసాయం లాభసాటి అవుతుంది’’ అని సిఎం తెలిపారు.

సిద్ధిపేటలో నిర్మించినటువంటి ఫ్యాక్టరీ కొడంగల్‌లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నానని సిఎం అన్నారు. ‘‘అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని రైతులంతా ముందుకెళ్లాలి. తెలంగాణలో ఒక్కో జిల్లా.. ఒక్కో పంటలకు ప్రసిద్ధి. తెలంగాణలో సారవంతమైన భూములున్నాయి.. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించాం. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నాం. ఒకప్పుడు సౌరవిద్యుత్ వ్యాపారం అంబానీ, అదానీ వంటి వారు చేసేవారు. ఈ ప్రభుత్వం మహిళలచే సోలార్‌ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. ఈ ప్రభుత్వం మహిళలను ఆర్టిసి బస్సులకు యజమానులను చేసింది’’ అని సిఎం పేర్కొన్నారు.