
మన్నెవారి పల్లి వద్ద ఔట్‌లెట్ వైపు ప్రత్యేక పూజలు నిర్వహించి
టన్నెల్‌ను పునః ప్రారంభించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్‌ఎల్‌బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో జరిగిన ప్రమాదం కారణంగా నిలిచిపోయిన పనులు, సుమారు ఏడాది కాలం తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో నల్లగొండ జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య మన్నెవారి పల్లి వద్ద ఔట్‌లెట్ వైపు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పునః ప్రారంభించి నట్టుగా సమాచారం ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిలిచిపోవడంతో జిల్లాలోని సాగునీటి సరఫరాపై ప్రభావం పడింది. అయితే, ఇప్పుడు పనులు మొదలవ్వడంతో ఈ ప్రాంత రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి.
సొరంగం పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రస్తుతం డిబిఎం (- డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్) పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో ఈ డ్రిల్లింగ్ పనులను పూర్తి చేసి, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లీంచే ఈ సొరంగం పూర్తయితే, నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ప్రమాదం గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల్లో కొంతమంది మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కానీ, ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.