Reading Time: < 1 minute

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించలేదని.. నిధుల మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే లాభమేంటని కొందరికి సందేహం ఉండవచ్చు.. చట్టబద్ధత వస్తే లబ్ధిదారులకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి వారి బ్యాంకు ఖాతాల్లో పడతాయని చెప్పారు.

అందుకే, ఆరు గ్యారెంటీల చట్టబద్ధత కోసం బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారుచేశామని.. ఈ బిల్లును రాష్ట్ర శాసన సభలో, శాసన మండలిలో వచ్చే శుక్రవారం ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. మొన్న రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటామని చెప్పినట్లు.. ప్రజలు కూడా దరఖాస్తులు, దండాలు పెట్టాల్సిన అవసరం లేదని.. మీకు డబ్బులు రాకపోతే ఈ చట్టం ద్వారా డబ్బులు రాలేదని కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయొచ్చని కెటిఆర్ అన్నారు.