Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎంతో ముందుచూపుతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తాము అన్ని సమకూర్చడం.. కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడం అని అన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆయుష్ ఆస్పత్రులు తామే ఏర్పాటు చేశామని, పిహెచ్ సిలు కూడా తాను ఆరోగ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఎన్నికల కోడ్ వల్ల పిహెచ్ సిలు ప్రారంభించలేదని, బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లా జైలుకు భూసేకరణ చేసి.. నిధులు కేటాయించామని అన్నారు. జిల్లా జైలు పూర్తయి రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు వచ్చి ప్రారంభిస్తున్నారని విమర్శించారు.

శ్రమ తమది..శిలాఫలకాలు వాళ్లవి అని హరీష్ రావు మండిపడ్డారు. నర్మెట్టలోనే 350 మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని, రైతుబంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని రైతుల తరఫున అడుగుతున్నానని డిమాండ్ చేశారు. పంటల బీమా ఇప్పటికీ చేయించలేదని, వర్షాలు, తుఫానుల వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్ధిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని అన్నారు. మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టలేదా? అని..రుణమాఫీ పూర్తి చేశాకే సిద్ధిపేట వస్తా అన్నావు.. మరి రుణమాఫీ అయిందా? అని.. రుణమాఫీ కాకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? అని హరీష్ రావు ప్రశ్నించారు.