
లక్నో: డ్రమ్ము సిద్ధంగా ఉందా? అని ప్రియుడికి సందేశం పంపిన ప్రియురాలి ఫోన్ చూసి భర్త షాక్ తిన్నాడు. వెంటనే భార్యను ప్రియుడు వద్దకు వెళ్లాలని సూచించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజ్ కుమార్ అనే వ్యక్తి భార్య, ఆరు నెలల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ప్రియుడితో మాట్లాడుతుండడం గమనించి నిలదీశాడు. తనకు ప్రియుడు ఉన్నాడని అతనితో వెళ్లిపోతానని భార్య తెగేసి చెప్పింది. భార్య ఫోన్ పరిశీలించగా నగ్న ఫోటోలతో పాటు సిమెంట్ డ్రమ్ము మెసేజ్ చూసి ఒక్కసారిగా భర్త వణికిపోయాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఏం చేద్దామని భర్తను పోలీసులు ప్రశ్నించారు. తాను ఇంకొన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నానని, ఈమెతో కాపురం చేసి సిమెంటు డ్రమ్ములో ముక్కలుగా మారే బదులు ఈమెను వదిలేయడం మేలు అంటూ పోలీసులకు రాజ్ కుమార్ బదులిచ్చాడు. భార్యను ప్రియుడు వద్దకు పంపించాలని పోలీసులను ప్రాదేయపడ్డాడు. హమ్మయ్య ప్రాణాలతో బయటపడ్డానని పోలీస్ స్టేషన్ నుంచి భర్త వెళ్లిపోయాడు.