
ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ దర్శనానికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కోనేరులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఎపిలోని కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం చోటు చేసుకుంది. మృతుడిని ప్రశాంత్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలీవిధం గా వున్నాయి. తన కాబోయే భార్య, బంధువులతో కలిసి భీమేశ్వర స్వామి దర్శనం కోసం సామర్లకోటకు వచ్చిన ప్రశాంత్ స్వామివారిని
దర్శించుకునే ముందు స్నానం చేద్దామని ఆలయ కోనేరులో దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. ఇది గమనించిన స్థానికులు ప్రశాంత్‌ను కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నీటి లోతును సరిగా అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తు న్నారు. కేవలం నాలుగు రోజుల క్రితమే ప్రశాంత్ నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.