
రాష్ట్రంలోని రైతులు బాగున్నప్పుడే, రైతుల పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొంటాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని , రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 22వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నా మని సిఎం తెలిపారు. అలాగే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చి రైతులకు కష్టాలను తీర్చి, సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను అనుభవించే విధంగా చర్యలు తీసుకున్నామని సిఎం గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం లో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన అర్చకులను సిఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సంవత్సరం తెలంగాణలో రైతులకు ఎలాంటి విపత్తులు రాకూడదని భగవంతుడిని సిఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు.