
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.43కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నక్క రాజేష్ అనే వ్యక్తి సరూర్‌నగర్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయిస్తున్నాడు. వేరే ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. నిందితుడిపై నిఘా పెట్టి ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది సిఐ సత్యనారాయణ రావు, ఎస్సై శంకర్ కలిసి మన్సూరాబాద్‌లో తనిఖీలు నిర్వహించారు. రాజేష్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 1.070కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మక్రాన్ దత్తాత్రిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.36కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్, పిల్లర్ నంబర్ 146వద్ద ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌టిఎఫ్ సిఐ నాగరాజు, సిబ్బంది కలిసి తనీఖీలు నిర్వహించగా, పిల్లర్ నంబర్ 146వద్ద ఉన్న మెహిఫిల్ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.