
రంగారెడ్డి: పెంపుడు పిల్లి చనిపోయిందనే బాధతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బడంగ్‌పేట ప్రాంతం వెంకటాద్రి కాలనీలో హిమబింధు అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. హిమబింధు డిగ్రీ చదువుతోంది. ఇంట్లో పెంపుడు పిల్లి చనిపోవడంతో ఆమె విషాదంలో మునిగిపోయింది. పిల్లి మృతిని తట్టుకోలేక బుధవారం ఉదయం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.