
వాషింగ్టన్: ఇరాన్‌పై భీకరంగా యుద్ధం సాగుతు న్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ కీలక అధికారి రాజీనామా ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ‘జాతీయ ఉగ్ర నిరోధక కేం ద్రం’ (ఎన్‌సిటిసి) డైరెక్టర్ జో కెంట్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ పదవి నుంచి వైదొలుగుతున్న ట్టు తెలిపారు. ‘మనదేశానికి ఇరాన్ ఎటువంటి తక్షణ ముప్పును కలిగించలేదు. ఇజ్రాయెల్, దా ని శక్తిమంతమైన అమెరికన్ లాబీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ఈ యుద్ధాన్ని ప్రారంభించామన్నది స్పష్టం’ అని ‘ఎక్స్’లో జో కెంట్ ఓ పోస్ట్ పెట్టారు. చాలా ఆలోచించిన తరువాత ఈ నిర్ణ యం తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు జో కెంట్ లేఖ రాశారు.
“ గతంలో మూడు అధ్యక్ష ఎన్నికల సందర్భాల్లో మీరు ప్రచారం చేసిన విలువలకు, మొదటి హయాంలో అమలు చేసిన విదేశాంగ విధానాలకు మద్దతుగా ఉన్నా. మధ్యప్రాచ్యం లోని యుద్ధాలు ఉచ్చులాంటివని, అవి మనపౌరుల ప్రాణాలు తీయడమే కాకుండా , దేశ సంపదనూ క్షీణింప చేశాయని, గతేడాది జూన్ వరకూ అర్థం చేసుకున్నారు. అయితే రెండో పాలన ప్రారంభంలో ఉన్నత స్థాయి ఇజ్రాయెల్ అధికారులు, అమెరికన్ మీడియా లోని ప్రభావవంతమైన కొందరు వ్యక్తులు ఇరాన్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది‘అమెరికా ఫస్ట్ ’ నినాదాన్ని పూర్తిగా దెబ్బతీసి, ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లేలా పురిగొల్పింది.
అమెరికాకు ఇరాన్ తక్షణ ముప్పుగా పరిణమించిందని, ఇప్పుడు దాడి చేస్తే వేగంగా విజయం సాధించొచ్చని నమ్మించారు. కానీ ఇదంతా అవాస్తవం. ఇరాక్ యుద్ధం లోకి మనల్ని లాగేందుకు కూడా గతంలో ఇజ్రాయెల్ ఇదే ఎత్తుగడ వేసింది. మనం ఈ తప్పును మళ్లీ చెయ్యొద్దు. 11 సార్లు యుద్ధానికి వెళ్లిన ఓ సైనికుడిగా, ఇజ్రాయెల్ సృష్టించిన యుద్ధంలో భార్యను కోల్పోయిన వ్యక్తిగా అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని ఈ ఘర్షణలకు మన పౌరుల్ని పంపడాన్ని సమర్థించలేను. మనం ఇరాన్‌లో ఏం చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో మీరు పునరాలోచించాలి.” అని ట్రంప్‌ను ఉద్దేశించి జోకెంట్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని సరిదిద్ది అమెరికాకు ఒక చక్కని దారి చూపాలని తన లేఖలో కోరారు. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపారు.