Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘దానకర్ణుడి’లా సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా ‘కుంభకర్ణుడి’లా నిద్రపోతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ మ్మెల్యే కెటిఆర్ విమర్శించారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని కెటిఆర్ తెలిపారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్న ర్ ప్రసంగానికి విలువ ఉండాలని కెటిఆర్ అన్నారు. కానీ, గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా చేస్తున్నారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కెటిఆర్ సభలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలని కెటిఆర్ ప్రశ్నించారు. రైతులు, వితంతువులు, వృద్ధులు, నిరుద్యోగులు ఎవరు ధన్యవాదాలు చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. గ్యారంటీ కార్డులను భద్రపరచుకోవాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేయలేదా అని కెటిఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటుతున్నా హామీలు నెరవేరలేదని ఆయన ఆరోపించారు.

సిఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారని,కానీ, నేడు ఆ సంతకానికి, ఆయన చేసిన డిక్లరేషన్‌లకు జనం దృష్టిలో ‘జీరో వాల్యూ’ ఉందన్నారు. సిఎం సంతకం చేసిన ఫైల్‌కు దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని కెటిఆర్ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి తొలి సంతకం చేసిన ఫైల్ ఎక్కడికి పోయిందని కెటిఆర్ ప్రశ్నించారు. మాయమైన ఫైల్ కోసం సిట్ ఏర్పాటు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చింది ‘అభయహస్తం’ అని చెప్పుకుంటున్నా, అమల్లో అది ‘భస్మాసుర హస్తం’గా మారిందని కెటిఆర్ విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రతి కుటుంబానికి రావాల్సిన రూ. 2.50 లక్షల లబ్ధి అందిన ఒక్క కుటుంబమైనా రాష్ట్రంలో ఉందా అని కెటిఆర్ ప్రశ్నించారు. ఇటీవల ఇండియా టీ20 వరల్డ్‌కప్ గెలిచిందని, ఒకవేళ ‘420 వరల్డ్ కప్’ పెడితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గెలుస్తుందంటూ కెటిఆర్ విమర్శించారు. 420 హామీల మేనిఫెస్టో రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తా

గల్లీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతుంటే, పాలకులు మాత్రం ఢిల్లీకి విమానయాత్రలు చేస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు ‘నిల్’ లూటిఫికేషన్లు ‘ఫుల్’ అని కెటిఆర్ ఆరోపించారు. పెన్షనర్లకు టిఏ, డిఏలు రాక నరకయాతన పడుతున్నారని, గ్యారంటీ కార్డులు కాస్త ఇప్పుడు ‘బాకీ కార్డులుగా’ మారి వెక్కిరిస్తున్నాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని కెటిఆర్ ఖండించారు. జార్జ్ ఆర్వెల్ మాటలను గుర్తు చేస్తూ మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవమని, తాము కూడా ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు.

ప్రజల సొమ్ము పక్క రాష్ట్రాల్లో

ఉగాదులు, ఉషస్సులు వస్తున్నాయ్. పోతున్నాయ్ అని, ప్రజల జీవితాల్లో వెలుగులేవని ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. ప్రభుత్వం డిజాస్టర్ పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు’ అన్న చందంగా ఉందని కెటిఆర్ విమర్శించారు. ఎగనామాలు, పంగనామాలు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని కెటిఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల కోసం కోటి 25 లక్షల మంది చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం చారాణా పని చేసి బారాణా చేసినట్లుగా చెప్పుకుంటుందని కెటిఆర్ అన్నారు. నేనే రాజు నేనే మంత్రి అని మిడిసి పడితే మూటకట్టుకుని పోతారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కర్ణుడిని అని చెప్పుకుంటున్నారని, ఆయన ఎన్నికల ముందు దానకర్ణ, ఇప్పుడు కుంభకర్ణ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. డిక్లరేషన్‌ల కోసం ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చారని, కానీ, వాటిని అమలు మాత్రం చేయడం లేదన్నారు. ఇక తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం వాడుకుంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు.