
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్ అభిమానులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా సంగ్రామం ముగిసిన కొన్ని రోజులకే మరో క్రికెట్ పండగ అలరించేందుకు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కి మార్చి 28న తెరలేవనుంది. తొలి విడత షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది. మరి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి కూడా పది జట్లు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేతలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లు ఈ సీజన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. స్వదేశీ, విదేశీ క్రికెటర్లతో ఆయా టీమ్‌లు చాలా బలంగా మారాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు అన్ని జట్లలోనూ ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, డేవిడ్ మిల్లర్, విల్ జాక్స్, క్వింటన్ డికాక్, ఫిలిప్ సాల్ట్, డెవోన్ కాన్వే, స్టోయినిస్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఐపిఎల్ చెలరేగేందుకు సిద్ధమయ్యారు.
ఈ సీజన్‌లో అందరి కళ్లు అభిషేక్ శర్మ, శాంసన్, ఇషాన్ కిషన్‌లపైనే నిలిచాయి. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లో ఇషాన్ కిషన్, శాంసన్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన సంగతి తెలిసిందే. ఐపిఎల్‌లోనూ వీరు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చాలా బలంగా మారింది. గతంలో హెడ్, అభిషేక్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌కు చారిత్రక విజయాలు సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక సూర్యకుమార్, శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శుభ్‌మన్ గిల్, గ్లెన్ ఫిలిప్స్, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, మాథ్యూ షార్ట్ తదితరులు ఆయా జట్ల తరఫున ఐపిఎల్ బరిలో దిగనున్నారు. ఇక ప్రపంచ స్థాయి బౌలర్లు, ఆల్‌రౌండర్లు కూడా తమ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ రోజుల పాటు సాగే ఐపిఎల్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని చెప్పాలి.