Reading Time: < 1 minute

భువనేశ్వర్: పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు వేసింది. ఒడిశాలో రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి మద్దతుతో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్‌కు ఓటేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బిజెపి మద్దతు పోటీ చేసిన దిలీప్ గెలుపుకు కారణమైన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ మంగళవారం సస్పెండ్ చేసింది. ఈ ఎమ్మెల్యేలలో సనఖేముండికి చెందిన రమేష్ చంద్ర జెనా, మోహనకు చెందిన దాశరథి గోమంగో, బారాబతి-కటక్‌కు చెందిన సోఫియా ఫిర్దౌస్ ఉన్నారు.

సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు దిలీప్ కు ఓటు వేశారని పార్టీ నిర్దారించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ..సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టింది. “కాంగ్రెస్‌కు ద్రోహం చేసేవారు దేశానికి ద్రోహం చేస్తున్నట్లే” అని పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు రామచంద్ర కడమ ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ విప్ జారీ చేసినప్పటికీ, ఈ ఎమ్మెల్యేలు క్రాస్-వోటింగ్‌కు పాల్పడ్డారని, ఈ చర్య రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొన్నారు.