
హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్ముల్లా గౌరవిస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా భట్టి మాట్లాడారు. నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, పేదల ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది లెక్కలతో చెబుతామని, గతంలో పెండింగ్ పెట్టిన వడ్డీ లేని రుణాలను తాము క్లియర్ చేస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, బిఆర్ఎస్ వాళ్లు ఎన్ని అడ్డుంకులు సృష్టించినా వడ్డీలేని రుణాలు ఇచ్చి తీరుతామని భట్టి పేర్కొన్నారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దారి తప్పారని అనిపిస్తోందని, బిఆర్ఎస్ పాలనలో మహిళల అభ్యున్నతిని గాలికి వదిలేశారని విమర్శించారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి గత ప్రభుత్వానికి ఆలోచన లేదని, బిఆర్ఎస్ హయాంలో మహిళా మంత్రులను తీసుకోలేదని మండిపడ్డారు. ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించే చర్యలు తీసుకుంటామని, ఇదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు ఇప్పటివరకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇప్పించామని, మహిళల పట్ల చులకనగా మాట్లాడటం సరికాదని అన్నారు. మీ ఇంటి ఆడబిడ్డపై ఎలాంటి గౌరవం ఉందో రాష్ట్రమంతా చూస్తోందని, మీ వ్యాఖ్యలు కోట్లాది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.