
దేశం లోని అసోం, పశ్చిమబెంగాల్,కేరళ, తమిళనాడు నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఏప్రిల్ 9 నుంచి 29 మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి మాత్రం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తరువాత ఎన్నికలు జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువల్ల ఇదివరకులా సాధారణంగా ఓటు శాతం వాటా గురించి ఊహాగానాలు చేయడానికి అవకాశం ఉండదు. అయినా అంచనాలు తప్పడం లేదు. పశ్చిమబెంగాల్ లోని టిఎంసి, తమిళనాడు లోని డిఎంకె, కేరళ లోని సిపిఎం ప్రస్తుతం పాలకవర్గాలుగా ఉండడమే కాదు, చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవినుంచి తొలగించాలని అభిశంసన ప్రకటించినవే. ఇప్పుడు ఆ చీఫ్ ఎన్నికల కమిషనర్ నేతృత్వం లోనీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం. నాలుగు రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో పాలిస్తున్న ప్రభుత్వాలకు మళ్లీ విజయావకాశాలు ఉన్నాయా లేదా తేల్చే అగ్ని పరీక్ష. కేరళలో సిపిఎం కూటమి ఎల్‌డిఎఫ్ గత పదేళ్లుగా అధికారంలో ఉంది. అసోంలో కూడా సిపిఎం ప్రాధాన్యంలో ఉంది.
బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓటరు అదే ప్రభుత్వం మళ్లీ ఎందుకు అని అసంతృప్తి చెందినా తొందరపడి పరిపాలన మార్పుకు ఓటు వేయడం తెలియని రాష్ట్రంగా పశ్చిమబెంగాల్‌కు పేరుంది. కేరళలో ఎల్‌డిఫ్‌కు కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్ ప్రధాన విపక్షంగా వ్యవహరిస్తున్నా జాతీయ స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాష్ట్రాలకు ఇబ్బందిగా తయారైందని ఆయా ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ ఓటర్లను కలుపుకోకుండా నిజమైన ఓటర్లను అనర్హులుగా చేస్తోందని వాదిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తాను నివసిస్తున్న నియోజకవర్గం లోనే ఓటు నమోదు చేసుకోవాలి. ఇంకెక్కడైనా నివసిస్తుంటే ఈ ఓటును రద్దు చేసుకుని అక్కడ నమోదు చేయించుకోవాలి. అయితే ఇది అంత సాఫీగా జరగదు. ఓటర్ల జాబితాలో 100 శాతం నమోదు ఎప్పటికీ సాధ్యం కాదు.
ఎన్నికల కమిషన్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఓటర్లను నమోదు చేసినా కొంత శాతం ఓటర్లు జాబితాలో చేరకపోవడం లేదా తప్పుడు వివరాలు నమోదు కావడం జరుగుతుందనే ఆరోపణలు ఉంటున్నాయి. పశ్చిమబెంగాల్‌లో అదనపు ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత తుది జాబితాకు చేర్చడమవుతుందని ఎన్నికల అధికారులు భరోసా ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో , కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రం మొత్తం ఓటర్ల సంఖ్య నిర్ధారణైంది. 2021లో పశ్చిమబెంగాల్‌లో మొత్తం 8 రౌండ్ల వంతున పోలింగ్ జరిగింది. ఆ సమయంలో ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు రెండు రౌండ్ల లోనే ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి వచ్చే ఫిర్యాదులను ఎంతవరకు పరిష్కరిస్తారో చూడాలి. రౌండ్లు కేవలం రెండే కాబట్టి రాజకీయ హింసకు అవకాశం ఉండకపోవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. కానీ ఈ విషయంలో ఏదీ చెప్పలేం. ఒకవేళ రాజకీయ హింసాత్మక సంఘటనలు జరిగినా పరిష్కరించగలమని ఎన్నికల సంఘం చెబుతోంది. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల రోజు ఏప్రిల్ 23కు ముందే వివాదాస్పద ఓటర్ల జాబితాలు అందుబాటులోకి వస్తాయి.
పాత జాబితాలను తిరిగి అమలు చేసే ప్రశ్నే లేదు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిబంధనల ప్రకారం క్రమపద్ధతిలోనే జరిగినప్పటికీ ఎవరికైనా అర్హులకు ఓటు వేసే అవకాశం రాకుంటే సమస్య పరిష్కరించి న్యాయం చేకూరుస్తామని ఎన్నికల అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదులో తొందరపాటు నిర్ణయంపై నడుస్తున్న వివాదానికి ముగింపు పలకాలి. ఇక అసోం, బెంగాల్, కేరళలో ముస్లిం ఓట్లు పాత జాబితాల ప్రకారం స్థిరంగా ఉంటాయా లేక సర్ ప్రక్రియలో తొలగింపబడ్డాయా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లు రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతమే ఉన్నాయి. బెంగాల్ టిఎంసికి, కేరళ యుడిఎఫ్‌కు ముస్లిం ఓటర్లు మద్దతుగా ఉంటున్నారు. అసోంలో విపక్షాలకు ముస్లిం ఓటర్లు మద్దతు ఇస్తున్నారు. ఒవైసీకి చెందిన ఎఐఎంఐఎం, అజ్మల్‌కు చెందిన ఎఐయుడిఎఫ్ అసోంలో విపక్షాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కేరళ లోని ఎల్‌డిఎఫ్‌లో హిందూవర్గాల వైపు బిజెపి చొచ్చుకుపోకుండా అడ్డుకోవలసిన సామర్థం కేరళ ముఖ్యమంత్రి పినరయి చూపిస్తేనే ఎన్నికల్లో నెగ్గే అవకాశాలు ఉంటాయి.
కొన్ని వారాల క్రితం తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురడం బిజెపికి కొంత బలం వచ్చినట్టయింది. అది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చెప్పలేం. బెంగాల్‌లో ముస్లిం ఓటర్లను బంగ్లాదేశ్‌నుంచి వచ్చే చొరబాటుదారులుగా బిజెపి ప్రచారం చేస్తోంది. అయితే ఈ చొరబాటు దార్లను గుర్తించడానికి ఇతర రాష్ట్రాల నుంచి జ్యుడీషియల్ అధికారులు వచ్చి బెంగాల్‌లో తిష్ట వేస్తున్నారు. మాతువా అనే దళిత వర్గాలు బంగ్లాదేశ్ జాతీయులన్న జనాభా గణన అధికారులు తేలుస్తున్నారు. ఈ వర్గాలను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో దీనిపై ఆందోళన చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంవల్ల బెంగాల్‌లో ఇప్పుడున్న ఓటర్ల జాబితా తుది జాబితా కింద పరిగణించలేం. ఈ వ్యత్యాసాలన్నీ తొలగించిన తరువాత సుప్రీం కోర్టు సప్లిమెంటరీ ఓటర్ల జాబితాలకు అవకాశం ఇచ్చినప్పుడే తుది జాబితాలు ఖరారవుతాయి. ఇదిలా ఉండగా 30 లక్షల మహిళా ఓటర్లు జాబితాల నుంచి తొలగించబడడం కూడా ప్రధాన సమస్యగా తయారైంది. ఇన్ని సమస్యల మధ్య ఎన్నికలు జరుగుతుండడం ఓటర్లకు అగ్నిపరీక్షే.