Reading Time: 4 minutes

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సమ గ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి స్వప్నాన్ని సా కారం చేసుకోవడానికి ఐకమత్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్న ర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలను అందించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర అసెం బ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రపాత్ శుక్లా సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్ర జా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు, సాధించిన విజయాలు, ఆశయాలు, భవిష్య త్తు లక్ష్యాలను సవివరంగా సభ ముందు ఆవిష్కరించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయసభలను ఉద్దేశించి కొద్దిసేపు తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన సభ్యులందరికీ గవర్నర్ హృదయపూర్వక స్వాగ తం పలుకుతూ… ప్రపంచంలోనే గుర్తింపు పొం దిన

రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగా ణ రైజింగ్ -2047 విజన్‌తో ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రతిపౌరుడు అభివృద్ధిలో భా గస్వామిగా ఉండేలా బడ్జెట్‌ను రూపొందించిన ట్లు తెలిపారు. ఆవిష్కరణల్లో అగ్రగామిగా, బలహీన వర్గాలకు భరోసాగా, ప్రపంచానికి ఆదర్శం గా తెలంగాణను నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. అందుకోసం బలమైన పునాదులు వేసేందుకు ఏడాది కాలం లో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల ను చేపట్టిందని చెప్పారు. సమున్నతమైన ఆశయంతో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గడిచిన రెండేండ్లుగా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరిచి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు.

క్యూర్, ప్యూర్, రేర్ మోడల్

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా అంచెలంచెలుగా వికేంద్రీకృత వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరించిందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను పునర్వవస్థీకరించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిందని వివరించారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారం, పౌర సేవలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో పునర్వవస్థీకరణకు శ్రీకారం చుట్టిందని అన్నారు. దీనికి తోడుగా కోర్ అర్బన్ రీజియన్‌లో హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లగా మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పునర్వవస్థీకరించామని పేర్కొన్నారు.

హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం

కోర్ అర్బన్ ప్రాంతంలో సరస్సులు, చెరువులు, ట్యాంకులను పునరుద్ధరించడానికి ప్రజా ప్రభుత్వం నడుం బిగించిందని గవర్నర్ చెప్పారు.హైడ్రా ఏర్పాటు ద్వారా దాదాపు 60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా ఆక్రమణలు, కబ్జాలకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆధునాతన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో 55 కి.మీ. మేరకు మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టును చేపట్టిందని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యన ఉన్న ప్రాంతంలో (పెరి-అర్బన్ రీజియన్) మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎకో-ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్ కంపెనీలతో మౌలిక సదుపాయాల హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించామని పేర్కొన్నారు.

ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే 7వ స్థానం

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత కీలక గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శుక్లా వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సమ్మిట్ నిర్వహించడమే కాకుండా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లోని ప్రముఖులతో 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించిందని తెలిపారు. ఎగుమతుల్లో దేశంలోనే 7వ స్థానంలో తెలంగాణ నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, నెట్ జీరో ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య అనుసంధానంగా రేడియల్ రోడ్లు, శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణె నగరాలకు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లతో రాష్ట్రం ఆర్థిక వృద్ధి సాధిస్తుందని వివరించారు.

తెలంగాణ పురోభివృద్ధికి 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్‌ఫీల్ స్మార్ట్ సిటీ కోసం దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇంధన రంగంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23,187 మెగావాట్లకు పెరిగిందని, ఇందులో 44.55 శాతం పునరుత్పాదక వనరుల నుంచి రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. రైతులను వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను చేపట్టిందని చెప్పారు. 20,616 కోట్ల రూపాయల పంట రుణాల మాఫీ, సన్నరకం వరి ధాన్యానికి 500 రూపాయల చొప్పున బోనస్, పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, గిట్టుబాటు ధరలకు ధాన్యం సేకరణ, సౌర శక్తితో నడిచే పంప్ సెట్లకు తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం

భూమి సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి తెలంగాణ భూ భారతి చట్టం అమలులోకి తేవడమే కాకుండా సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలని ప్రతి కుటుంబానికి సంక్షేమంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టిందని, కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని అన్నారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ప్రతి లబ్దిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తోందని వెల్లడించారు. 22,500 కోట్ల రూపాయలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు.

మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలను వ్యాపారస్తులుగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దే మహాత్తర చర్యలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు 269.68 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, తద్వారా రూ. 9,222 కోట్లకు పైగా మహిళలు ఆదా చేసుకున్నారన్నారు. మహాలక్ష్మి పథకంలో 42.90 లక్షల కుటుంబాలకు సబ్సిడీపై 500 రూపాయలకు ఎల్‌పిజి సిలిండర్ అందిస్తున్నామని, గృహజ్యోతి కింద పేదల గృహాలకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న కార్యక్రమంవల్ల 53.09 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని చెప్పారు.

విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం

విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి నూతన విద్యా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని గవర్నర్ వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను 212 శాతం పెంచామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని అన్నారు. యువతలో నైపుణ్యతను పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపించడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను ఎటిసిలుగా మార్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తోందని చెప్పారు. వైద్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి 11 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌నగర్, అల్వాల్,

ఎల్బీనగర్ టిమ్స్, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం వంటివి ఈ ఏడాది చివరి నాటికి సేవలను అందుబాటులోకి తేవాలన్న కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్లడానికి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రారంభించిందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాడనికి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 64,697 అర్జీలు అందగా, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 47,670 విజ్ఞప్తులను పరిష్కరించామని వెల్లడించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించామన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో ముందడుగు వేసి 59 ఎస్సీ కులాలను రిజర్వేషన్ వర్గీకరణ పూర్తి చేసిందని తెలిపారు.

రికార్డ్ సమయంలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

మాదక ద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి కల్పించాలన్న దృఢనిశ్చయంతో ఈగల్ ఏర్పాటు చేశామని గవర్నర్ శుక్లా పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం పీఎస్సీని పునరుద్ధరించడమే కాకుండా రికార్డు సమయంలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని వ్యాఖ్యానించారు. సినిమా రంగంలో ప్రతిభను గుర్తించడానికి గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రారంభం, తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వ సంరక్షణలో భాగంగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పుణ్య క్షేత్రాల అభివృద్ధి, వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఒక చారిత్రక మార్పు దశలో నిలబడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక చారిత్రక మార్పు దశలో నిలబడిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఎంచుకునే ప్రతి పాలసీ, అమలు చేసే ప్రతి కార్యక్రమం, చేపడుతున్న ప్రతి సంస్కరణ ఈ ప్రాంత ప్రజలకు అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. సమ్మిళిత వృద్ధి దిశగా వారిని నడిపించి మరింత శక్తివంతులుగా తయారు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సభలో బిఆర్‌ఎస్ నిరసన

శాసనసభలో బిఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల ఆందోళన మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.