Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. సోమవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులనుద్ధేశించి చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనమండలి, శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఏసి) సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. 20న రాష్ట్ర ఆర్ఖిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదిస్తారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రి కౌన్సిల్‌లో బడ్జెట్ ప్రతిపాదిస్తారు.

ఇదిలాఉండగా ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్, 27న శ్రీ రామ నవమి సందర్భంగా సెలవులుగా నిర్ణయించారు. అయితే రంజాన్ మర్నాడు ఆదివారం కూ డా సభను నిర్వహించాలన్న అంశం చర్చకు రాగా, ఈ అం శంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సెలవులు అధికంగా ఉన్నందున, ప్రస్తుతం సమావేశాలను ప్రతి రోజూ ఉదయం పది గంటలకు కాకుండా, ఉదయం తొమ్మిది గం టలకే ప్రారంభించాలని బిఆర్‌ఎస్ చెప్పడంతో అందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అంగీకరించలేదని తెలిసింది. ఈ నెల 30వ తేదీన కూడా ఉభయ సభలనూ నిర్వహించాలని విపక్షాల సభ్యు లు కోరడంతో, ఆలోచిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

30న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం

ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన పద్దులు (డిమాం డ్లు), ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ఆమోదించుకుంటుంది. ఆరు రోజుల పాటు చర్చ జరిగే 30వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. ఇంకా మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం, గిగ్ వర్కర్స్‌కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్రధానం గా చర్చించనున్నారు. హైడ్రాతో ప్రజలకు కలిగిన మేలు, తదితర అంశాలపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ లాబీల్లో మీడియాపై ఆంక్షలు

ఇదిలాఉండగా అసెంబ్లీ లాబీల్లో మీడియాపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ లాబీల్లో విధి నిర్వహణలో ఉండే విలేకరులు ఎక్కువగా మంత్రుల ఛాంబర్లలో బైఠాయించడం వల్ల మంత్రులకు వ్యక్తిగత స్వేచ్చకు భంగం వాటిల్లుతున్నదని, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బా బు దృష్టికి వచ్చింది. ఈ విషయమై విలేకరులు మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించగా, లాబీల్లో ఉండే సెంట్రల్ హాలు వరకు పరిమితమైతే ఇబ్బంది లేదన్నారు. ఇప్పటి వరకు ఆంక్షలు ఏమీ పెట్టలేదన్నారు. అయితే అసెంబ్లీకి పక్కనే కౌన్సిల్ సమావేశాలూ ప్రారంభమైనందున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వ్యక్తిగత సిబ్బందితో లాబీలు సందడిగా మారాయి.