
సరదాగా ఈత కొడదామని వెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గండిపేట మండలం పరిధిలో తీవ్ర కలకలం రేపింది. యువకులు ఈతకు దిగి గల్లంతై చివరకు మృత్యువాత పడిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన గోవర్ధన్ (26) గోవర్ధన్ తమ్ముడు కార్తీక్ (19), బంధువు వెంకటేష్ (19) ఆదివారం గండిపేట్ జలాశయం బ్యాక్ వాటర్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు.
ముగ్గురిలో ఒకరు నీట మునిగి పోతుంటే కాపాడే క్రమంలో ముగ్గురు మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు రెస్కూ టీమ్, ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇబ్రహీంబాగ్‌లో విషాదం నెలకొంది. మృతుల కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గోవర్ధన్ ప్రసాద్ భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.