
హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో మనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణకు సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తి చూపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం టిడిపి చేతిలో కీలుబొమ్మగా మారిందని, సిడబ్ల్యూసి మీటింగ్ వెళ్లటం లేదంటూనే.. ఎపి డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్ అజెండా మొదటి అంశం.. పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు అని..అజెండాలో నల్లమల సాగర్ లేకుంటేనే మీటింగ్ వస్తామని చెప్పి తెలంగాణను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు.
రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదని సిడబ్ల్యూసి మీటింగ్ లో జిఆర్ఎంబి చెప్పిందని, బచావత్ ట్రైనల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని జిఆర్ఎంబి అంటోందని, జలాల పంపిణీ జరగలేదని జిఆర్ఎంబి ఎలా చెబుతుంది? అని.. గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. గోదావరి బేసిన్ లో వివిధ రాష్ట్రాలు చేపట్టిన 76 ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇచ్చారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని హరీష్ రావు ధ్వజమెత్తారు.