Reading Time: 3 minutes

 మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు

నిందితులకు 14 రోజుల రిమాండ్ పోలీసులపై

కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణించిన

జడ్జి డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపి మహేశ్

యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి

సహా ఆరుగురికి పాజిటివ్ పార్లమెంట్

సభ్యుడితో పాటు 8మందికి స్టేషన్ బెయిల్

మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పా ర్టీ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు 14రోజుల రిమాం డ్ విధించింది. ఆదివారం రాత్రి ఉప్పర్‌పల్లి మెజిస్ట్రేట్ ఎదు ట పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, మరో నిందితుడు నమిత్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకున్న ఈగల్ పోలీసులు అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏలూరు ఎంపి పుట్టా మహేశ్ యాదవ్, పైలట్ రో హిత్‌రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే టిడిపి ఎంపి పుట్టా మహేష్ కుమార్, కౌషిక్ రవి, అర్జున్ రెడ్డి, రమేష్, విజయ్ కృష్ణ, శ్రవణ్ కుమార్, శరత్ కుమార్, ప్రియాంక లకు స్టేషన్ బెయిల్ లభించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు ఓ ప్రకటనలో వె ల్లడించారు. ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పార్టీలో అదుపులోకి తీసుకున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు ఉప్పర్ పల్లిలోని జడ్జి నివాసంతో ఆయన ఎదుట హాజరు పరిచ్చారు. వారికి బెయిల్ ఇవ్వాలని నిందితుల తరుపు న్యాయవాదులు వాదించారు. అయితే ప్రధానంగా గన్ ఫైరింగ్ గురించి పోలీసులు దృష్టి సారించడంతో ప్రభుత్వ న్యాయవాదులు సైతం ఆ దిశగానే వాదనలు వినిపించారు. కాగా, నిందితుల్లో మాజీ ఎంఎల్‌ఏ రోహిత్ రెడ్డి, టిడిపి ఎంపి మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌషిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి లకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఫాం హౌస్‌లోనే నిందితులకు యూరిన్ పరీక్షలు నిర్వహించగా, ఎంపి మహేష్ కుమార్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. యూరిన్ పరీక్షల(ర్యాపిడ్ టెస్ట్) సమయంలో మహేష్ కుమార్‌కు నెగిటివ్ వచ్చిందని, తరువాత రక్త పరీక్షలు నిర్వహించడంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తు జరుగుతోంది : ఈగిల్ ఎస్పీ గిరిధర్

ఈగిల్ ఎస్పీ గిరిధర్ రంగారెడ్డి ఈగిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాతూ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్ర గ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. డ్ర గ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని, ఆ విధంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయని, పోలీస్‌లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్క డే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న వ్యక్తి సిల్వేరి శరత్ కు మార్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పా యింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చే సుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. ఫామ్‌హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డ్రగ్స్ వినియోగం గుర్తిస్తే టోల్ ఫ్రీ 1908 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం ఉంచుతామని తెలిపారు.

పుట్టా మహేష్ పై చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్ర ప్రదేశ్ ఎంపి పుట్టా మహేష్ కుమార్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్ర గ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఘటనపై మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ప ల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపి మహేష్‌కు పార్టీ అధ్యక్షుడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లోపు లిఖిత పూ ర్వక వివరణ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

పార్లమెంట్ జరుగుతుంటే డ్రగ్స్‌తో చిందులు వేస్తున్న ఎంపి: వైస్ షర్మిలా రెడ్డి

ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంటే టిడిపి ఎంపి పుట్టా మహేష్ ఫాం హౌస్‌లో కొకైన్‌తో చిందులు వేస్తొన్నాడని ఏపిసిసి చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇదెక్కడి బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. పాజిటివ్ వచ్చిన ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఎంపి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.