Reading Time: < 1 minute

ప్రశ్నించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? అని ఆయన ఆదివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పట్టుబడడంపై కెటిఆర్, ఇంకా ఆయన బృందం స్పందించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదని, ఈగల్ టీంకు లభించిన సమాచారం మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహించిందని ఆయన చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఈగల్ టీం తమకు లభించిన పక్కా సమాచారం, ఆధారాలతో దాడులు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తెలిసే ఈగల్ టీం దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

నో-డ్రగ్స్- సేవ్ తెలంగాణ

ఇదిలాఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలో నో-డ్రగ్స్&సేవ్ తెలంగాణ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ కెటిఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తూర్పారబట్టారు.

డ్రగ్స్ సంస్కృతి తెచ్చిందే కెటిఆర్

ఎంతో ప్రశాంతంగా ఉండే మొయినాబాద్‌లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను డ్రగ్స్ వైపు కెటిఆర్ ఉసిగొల్పారని పిసిసి అధికార ప్రతినిధి గౌరి సతీష్ ఆరోపించారు. సమాజంలో సంఘవిద్రోహ శక్తులుగా కెటిఆర్ నిలిచిపోతారని ఆయన హెచ్చరించారు.