
ప్రతీ డ్రగ్స్ కేసులోకి
అనవసరంగా నా పేరును
లాగితే చట్టపరమైన
నోటీసులతో స్పందించాల్సి ఉంటుంది
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. డ్రగ్స్ వాడేవారు ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ఏ టెస్టుకైనా తాను సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని, మనమే ఉదాహరణగా నిలుద్దాం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా తాను వ్యతిరేకం అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని బిఆర్‌ఎస్ పార్టీపై బురద చల్లడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా తన పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.