
ఎల్.బి.స్టేడియంలో
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
హాజరైన సిఎం, మంత్రులు, పిసిసి చీఫ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహాభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్.బి.స్టేడియంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రంజాన్ పవిత్ర మాసం సమాజంలో సఖ్యత, సోదర భావం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి అవసరం అని ముస్లీంలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు వందలాది మంది మైనార్టీ యువతీ యువకులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్లే కారణం అని సిఎం పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి, షబ్బీర్ అలీకి సలహాదారుగా, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డిఎస్‌పిగా ఉద్యోగ కల్పించడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. 8 మంది మైనారిటీ నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ఈ రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు అని, విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం అని వ్యాఖ్యానించారు. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత అని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.