Reading Time: 2 minutes

దుబాయ్/ వాషింగ్టన్ : ఇంధన కేంద్రీకృతంగా పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు మరింత రగులుకుంది. శనివారం తెల్లవారుజామున అమెరికా సేనలు ఇరాన్‌కు చెందిన ఖర్గ్ దీవిపై దాడికి దిగింది. ఇరాన్ ఆధీనంలోని ఈ ఐలాండ్ ఇరాన్‌కు 42 కిలోమీటర్లదూరంలో హర్మూజ్ జలసంధి చమురు రవాణా మార్గానికి అనుసంధానంగా ఉంది. ఈ దీవి ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ దీవి ద్వారానే నిరంతరం ఇరాన్ చమురు ఎగుమతులు జరుగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రధానమైన ఈ దీవిపై తమ సేనలు వైమానిక దాడులకు దిగాయని, అక్కడి దాదాపు 90 సైనిక స్థావరాలను దెబ్బతీశాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్రమేపీ ఇరాన్ చమురు మౌలిక సాధనాసంపత్తిని, ప్రత్యేకించి సరఫరాల వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఈ కీలక దీవిపై దాడి ద్వారా అక్కడి ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయని ట్రంప్ తెలిపారు. ఇప్పటికైనా ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు నౌకల రాకపోకలకు ఆటంకాన్ని నిలిపివేయాల్సి ఉంది. లేకపోతే ఇరాన్ చమురు వ్యవస్థ పూర్తిగా దెబ్బతినేలా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఖర్గ్ ఐలాండ్ ఆయువుపట్టు వంటిది.

చాలా చిన్నదిగా కేవలం ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ దీవి ఇరాన్ చమురు వ్యాపారానికి అత్యంత కీలకంగా ఉంటూ వస్తోంది. ఇక్కడి నుంచే ఇరాన్‌కు చెందిన చమురు ఉత్పత్తులలో దాదాపు 90 శాతం వరకూ కోటా ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతానికి ఖర్గ్‌లోని సైనిక స్థావరాలను దెబ్బతీశామని, అయితే చమురు ఉత్పత్తి స్థావరాల జోలికి వెళ్లలేదని ట్రంప్ ప్రకటించారు. ఈ దీవిపై అమెరికా దాడిపై ఇరాన్ నిర్థారించింది. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తామని, ఇక్కడి చమురు కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం పడలేదని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. దాడిని ఇరాన్ సాయుధ బలగాల అధికారుల బృందం సమీక్షించింది. ఇరాన్ చమురు మౌలిక సదుపాయా ఇరాన్‌తో అమెరికా , ఇజ్రాయెల్ యుద్ధం రెండో వారం దాటి తీవ్రతరం అవుతోంది. ఈ దశలోనే అమెరికా గల్ఫ్ ప్రాంతానికి పదివేలకు పైగా డ్రోన్లను రక్షణ కవచంగా తరలించింది. ఈ ప్రాంతానికి 2500 మంది అమెరికా యుద్ధ నావికులు , ఓ ఉభయచర దాడుల యుద్ధనౌకను పంపించింది. గల్ఫ్ ప్రా ంతంలోని సైనిక స్థావరాల భద్రతకు ఈ చర్యలు చేపట్టారు.

యుఎఇలో ఫుజేరియా పోర్టుపై ఇరాన్ దాడి

షార్జాలో అమెరికా నౌకను దెబ్బతీసిన ఇరాన్ వెనువెంటనే యుఎఇలోని ఫుజైరా రేవుపట్టణంపై దాడికి దిగింది. ఆయిల్ టర్మినల్‌కు నష్టం కల్గించింది. యుఎఇకి ఈ ప్రాంతం అత్యంత కీలకమైన చమురు ఉత్పత్తి కేంద్రంగా ఉంది. ఏడు ఎమిరేట్స్‌లలో ఒకటి అయిన ఈ పట్టణం ఓమన్ గల్ఫ్ తీరంలో పర్వతాలు, సముద్రతీరాలతో ఉంది. చమురు నిల్వలు , ఓడరేవు కేంద్రంతో ఉండే ఈ ప్రాంతంలో పలు వృత్తులలో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఇరాన్ వైమానిక దాడులతో ఈ ప్రాంతంలోని చమురు నౌకల్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పోర్టు చమురు వ్యాపారానికి కీలకంగా ఉంది. ఎక్కువగా ఎగుమతులు సాగే కేంద్రం కూడా కావడంతో ఎమిరేట్స్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం అయింది. ఇప్పటివరకూ అమెరికా సైనిక స్థావరాలనే ఎంచుకుని దాడులకు దిగుతూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు ఈ దిశలో తన పద్ధతి మార్చుకుంది. అమెరికా సైనిక స్థావరాలు ఉండే దేశాల ప్రధాన ఆర్థిక వనరులు, చమురు స్థావరాల విచ్ఛిత్తికి సంకల్పించినట్లు ఇప్పటి ఘటనలతో వెల్లడైంది. అయితే ఇక్కడ జరిగిన డ్రోన్ల దాడిని తాము సమర్థవంతంగాతిప్పికొట్టామని యుఎఇ వర్గాలు తెలిపాయి.

బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై దాడులు

ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీ కాంపౌండ్ శనివారం ఇరాన్ దాడులతో దద్దరిల్లింది. ఈ ప్రాంతంలోని హెలిపాడ్‌పై క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. ఈ విషయంపై యుఎస్ ఎంబసీ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. మరో వైపు ఇజ్రాయెల్, అమెరికా సైనిక బలగాలు ఇరాన్‌లోని పలు పట్టణాలను ఎంచుకుని దాడులకు దిగాయి. అయితే రెవెల్యూషనరీ గార్డ్ తీసుకుంటున్న చర్యలతో ఇరాన్ లోతట్టు ప్రాంతాలలో పెద్దగా నష్టం జరగలేదని వెల్లడైంది. ఇరాన్ పశ్చిమ ప్రాంత నగరం ఇయావాన్‌లో ఓ భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఇరానీయన్లు బలి అయ్యారు. మృతి చెందిన వారిలో ఆరు నెలల శిశువు కూడా ఉంది. పోరు ఆరంభం నుంచి ఇప్పటివరకూ ఇరాన్‌లో 1230 మంది వరకూ దాడులలో మృతి చెందారు. తమ దేశానికి చెందిన 52 సాంస్కృతిక కేంద్రాలు ధ్వంసం అయ్యాయని ఇరాన్ తెలిపింది. కుర్దిస్థాన్ ప్రాంతంలోని సనన్‌దాజ్ లో ఇజ్రాయెల్ దాడులతో ఈ పరిణామం జరిగింది. ఈ విషయాన్ని దేశ సాంస్కృతిక మంత్రిత్వవశాఖ తెలిపింది. ఇక బహరైన్‌పై ఇరాన్ పది డ్రోన్లతో దాడికి దిగింది.