Reading Time: < 1 minute

అందాల పోటీలకు, ఫుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ రెడ్డి తీరు తయారైందని కెటిఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారని అన్నారు. లక్షన్నర కోట్ల రూపాయలతో మూసిని అభివృద్ధి చేస్తామంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ పిపిటి ప్రజంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పిపిటి ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పిపిటి ఇచ్చారని విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పిపిటి ఇస్తే, మూసీని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన తాము వివరిస్తున్నారని చెప్పారు.

ఒక్క ఇల్లు కూలగొట్టకుండా గత ప్రభుత్వం ఆరు కిలోమీటర్ల మూసిని విజయవంతంగా అభివృద్ధి చేసిందని వ్యాఖ్యానించారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్‌రెడ్డి పాపాన్ని కడుక్కోవాలని అన్నారు. నమామి గంగేకి ఖర్చు 42 వేల కోట్లు అని, వందల కిలోమీటర్ల నమామి గంగేకి అంత ఖర్చు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే తమ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోమని, కానీ మూసీ పేరుతో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.