Reading Time: < 1 minute

అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న 11 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మసాచుసెట్స్, కెంటకీ, ఒహియో రాష్ట్రాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాము వివిధ రకాల నేరాల బాధితులమని, వాళ్లకు కావాల్సిన వివిధ రకాల షాపుల్లో దొంగతనాల బారినపడ్డట్టు నకిలీలు సృష్టించి గ్రీన్ కార్డులు పొందేందుకు పథక రచన చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ విధంగా మూడు రాష్ట్రాల నుంచి జితేంద్ర కుమార్ పటేల్, మహేష్ కుమార్ పటేల్, సంజయ్ కుమార్ పటేల్, దీపికాబెన్ పటేల్, రమేష్‌భాయి పటేల్, అమితాబహెన్ పటేల్, రోనక్ కుమార్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మింకేష్ పటేల్, సోనాల్ పటేల్, మితుల్ పటేల అనే వ్యక్తులను వీసా ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

వీరిలో దీపికా పటేల్‌ను దేశం నుంచి పంపించివేసినట్లు తెలిపారు. మిగతా వారిని బోస్టన్‌లోని వివిధ కోర్టుల్లో హాజరుపరిచి వదిలేసినట్లు వివరించారు. అయితే గ్రీన్‌కార్డులు పొందేందుకు వీరంతా దొంగతనం డ్రామాలు ఆడినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీల బాధితులమని యూవీసా పొందేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. హింసాయుత నేరాల్లో బాధితులకు అక్కడే ఉండేందుకు వలసదారులకు అమెరికా ప్రభుత్వం యూవీసా వెసులుబాటు కల్పిస్తుంది. దీని ఆధారంగా ఐదు పదేళ్లలో గ్రీన్ కార్డు పొందే మార్గం కూడా ఉంది. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పలువురు గ్రీన్ కార్డు పొందేందుకు ఇలాంటి నకిలీ నేరాలను సృష్టించుకుంటున్నారని విచారణలో అధికారులు తేల్చారు.