
కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముందు ఆ పాపాన్ని కడుక్కోవాలని.. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకుని కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మూసీ ప్రాజెక్టుపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. “2016–17 సంవత్సరంలో రూ.16,634 కోట్లతో మూసీ సుందరీకరణ చేసేందుకు, ఆనాడు కేసీఆర్ హయాంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కానీ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. నిన్న అధికారులు మూసీ సుందరీకరణ వెబ్ సైట్లో కొన్ని ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు కూడా మా ప్రభుత్వంలో చేసిన మూసీ సుందరీకరణ ఫోటోలే. నేను రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తా తప్పేంటి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నాడు.. మరి మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం చేస్తున్నాడా లేక భూముల కోసం చేస్తున్నాడు అనుకోవాలా?. మూసీ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి. మూసీని ప్రక్షాళణ చేసేందుకు బీఆర్‌ఎస్ మంచి ప్రణాళికలు సిద్ధం చేసింది. మంచి రేవుల నుంచి ఘట్కేసర్ వరకు 57కి.మీ. పరిధిలో మూసీ రూపం మార్చాలనుకున్నాం. మూసీపై 15 బ్రిడ్జ్‌లు నిర్మించాలని ప్లాన్ చేశాం. కానీ, ఈయన లాగా డబ్బా కొట్టుకోలేదు. చేయంది చేసినట్లు.. ఉన్నది లేనట్లు చెప్పుకోలేదు” అని అన్నారు.