Reading Time: < 1 minute

దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధాన వైఫల్యాలే కారణమని కూనంనేని ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ తమపై దాడి చేయకుండా ముందస్తు దాడి చేస్తున్నామనే పొంతనలేని సాకుతో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వాన్ని మార్చాలని కుటిల నీతితో అమెరికా ఆ దేశంపై ఫిబ్రవరి 28న ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించాయని, పిల్లలు చదుకునే పాఠశాలలపై క్షిపణి దాడుల చేసి 165 మంది చదువుకునే అమ్మాయిలు, టీచర్లను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమయ్యిందని, బ్యారెల్ ధర రూ.1 00 డాలర్లు దాటిందన్నారు.

ఫలితంగా భారతదేశంలో గృహ అవసరాల గ్యాస్ సిలిందర్ ధర రూ. 60 పెరిగిందన్నారు. మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని బైట పరిస్థితి చూస్తే తేలిపోతోందన్నారు. గ్యాస్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హోటల్స్ ముతపడుతున్నాయని కూనంనేని తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే కారణమని ఆయనన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ నెల 16న తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని సిపిఐ ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించాలని, భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.