Reading Time: 3 minutes

ఎన్నికలు వస్తే చాలు ఉచిత పథకాల జాతర మొదలవుతుంది. పార్టీలు పోటీలు పడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముందూ వెనుకా చూడకుండా అపరిమిత ఉచితాలను ప్రకటిస్తుంటాయి.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 1.30 మిలియన్ జనాభా గలిగిన బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం అపారమైన సంక్షేమ ప్యాకేజీని ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేయడానికి వెళ్లకముందే 5 కోట్ల మంది మహిళలు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన (ఎంఎంఆర్‌వై) పథకం కింద నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ. 10 వేలు వంతున అందుకోగలిగారు. దీనికి తోడు పెన్షన్ పథకం కూడా కలిపి రూ. 9420 కోట్ల వరకు అదనపు భారం పెరిగి రాష్ట్ర బడ్జెట్ ఆదాయంలో పదోవంతు వ్యయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు తమిళనాడులో రానున్న ఎన్నికల కోసం పార్టీలు అపరిమితంగా ఉచితాలను ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి. ప్రతి మహిళకు నెలనెలా ఉచితంగా రూ. 2000 నగదు అందిస్తామని అధికార పార్టీ డిఎంకె ప్రకటించగా, ఎఐఎడిఎంకె కూడా రూ. 2000 ప్రకటించింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీ రూ. 2500 ప్రకటించింది.

ఇక వన్‌టైమ్ సహాయం కింద నేరుగా రూ. 5000 నెలవారీ పంపిణీ చేస్తామని డిఎంకె వెల్లడించగా, ఎఐఎడిఎంకె రూ. 2000, టివికె రూ. 2500 ప్రకటించాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని డిఎంకె, ఎఐఎడిఎంకె ప్రకటించగా, టివికె ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని డిఎంకె హామీ ఇవ్వగా, విద్యార్థులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. విద్యార్థులు చదువు సాగేలా సహాయం చేస్తామని టివికె వెల్లడించింది. మహిళలకు స్కూటర్ల కొనుగోలులో రూ. 25,000 సబ్సిడీ కల్పిస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. 8 గ్రాముల బంగారం మహిళలకు బహుమతిగా అందిస్తామని టివికె వెల్లడించింది. రైతులకు ప్రస్తుతం సబ్సిడీలు కలిస్తున్నామని డిఎంకె వెల్లడించగా, మత్స కార్మికులకు, గ్రామీణ సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తామని ఎఐఎడిఎంకె వెల్లడించింది. రైతులకు రుణ మాఫీ చేస్తామని టివికె ప్రకటించింది. పొంగల్‌తోపాటు ఇతర పండగలకు నగదు సహాయం చేస్తామని డిఎంకె వెల్లడించగా, రూ. 1000 వంతున పొంగల్ బహుమానం ఇస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది.

టివికె మాత్రం ఇంతవరకు దీని గురించి స్పష్టం చేయలేదు. తమిళనాడులో ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతోంది. 202425 బడ్జెట్ అంచనాల ప్రకారం ఉచిత విద్యుత్, మహిళలకు నగదు బదిలీ వంటి పథకాలకు సబ్సిడీల రూపంలో వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. 202425 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రెవెన్యూ లోటు రూ. 44,097 కోట్లుగా తేలగా, ఈ రెవెన్యూ లోటులో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి విద్యుత్ సంస్థకు ఇచ్చే నష్ట భర్తీ సబ్సిడీ రూ. 17,117 కోట్లుగా ఉంది. కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం కింద మహిళలకు నెలకు రూ. 1000 వంతున అందించే పథకానికి రూ. 13,720 కోట్లు కేటాయించవలసి వస్తోంది. దీనివల్ల 1.15 కోట్ల మంది లబ్ధి పొందుతారు. సమగ్రంగా చెప్పాలంటే తమిళనాడులో ఉచిత విద్యుత్, నగదు బదిలీ పథకాల వల్ల ఏటా రూ. 30,000 కోట్ల నుండి రూ. 50,000 కోట్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోంది.

సబ్సిడీలు, గ్రాంట్ల రూపంలో చెల్లించవలసిన మొత్తం 2024 25లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో రూ. 3,48,289 కోట్లుగా తేలింది. 2026 మార్చి 31 నాటికి తమిళనాడు నికర అప్పు రూ. 9,29,959 కోట్లకు చేరిందంటే తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని అపరిమిత ఉచితాలను ప్రకటించడం ఆర్థికంగా ఎంతవరకు నెట్టుకు రాగలదో చెప్పలేం. బడుగు వర్గాలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పనిచేసే మహిళలకు టూవీలర్లు, ఉచితంగా లేదా సబ్సిడీపైన సంవత్సరానికి ఉచితంగా ఆరు వంటగ్యాస్ సిలిండర్లు, పెళ్లిళ్లకు బంగారు కానుకలు, సిల్కు చీరలు, విద్యార్థులకు లాప్‌టాప్, స్కూటర్లు, బేబీ కిట్లు, శానిటరీ ప్యాడ్‌లు ఇవన్నీ ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి.

ఈ ఉచితాల సంస్కృతిపై సుప్రీం కోర్టు కూడా గట్టిగా హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంపై దాఖలైన వ్యాజ్యం సందర్భంగా సుప్రీం కోర్టు ఉచితాలపై తీవ్రంగా స్పందించింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత విద్యుత్ పథకం కల్పించేందుకు డిఎంకె ప్రభుత్వం ఆమోదించింది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు అభివృద్ధికి నిధులు కేటాయించక పోవడంపై తప్పుపట్టింది. ముఖ్యంగా ఆర్థిక స్తోమత ఉన్నవారికి విచక్షణా రహితంగా ఉచిత పథకాలను అందజేయడం వల్ల పనిచేయకుండానే ప్రతిఫలం లభించే సంస్కృతి ఏర్పడిందని హెచ్చరించింది.

ఈ పథకాన్ని చివరి నిమిషంలో ఎందుకు ప్రకటించారో వివరించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే ఉచితాలను ఇచ్చే విధానాన్ని పునః సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఉచిత ఆహారం, విద్యుత్‌ను అందించడం కొనసాగిస్తే వాస్తవ అభివృద్ధికి ఎలా నిధులు సమకూర్చుకుంటారో చెప్పాలని నిలదీసింది. ఇలా పంచుకుంటూ పోతే అభివృద్ధికి ఒక్కపైసా కూడా మిగలదని మండిపడింది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడంలో వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అత్యంత అవసరం.