Reading Time: 4 minutes

ఈ నెల 12వ తేదీ గురువారం నాడు ఒక వార్త టెలివిజన్ ఛానళ్లలో మారుమోగింది. ఇరాన్ ప్రభుత్వం రెండు ఆయిల్ ట్యాంకర్లను భారతదేశానికి వచ్చేందుకు అనుమతించింది. వాటిలో ఒకటి ఇప్పటికే భారతదేశానికి దాదాపు చేరగా, రెండవది బహుశా ఈ వ్యాసం వెలువడే సమయానికి రాగల అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో, అందువల్ల దేశంలో చమురు, గ్యాస్‌లకు ఏర్పడుతున్న సమస్యలు ఏమిటో చూస్తున్నదే గనుక, ఈ నౌకల రాక తప్పక సంతోషించవలసిన విషయమే. ట్యాంకర్ల రాక కోసం ఇరాన్‌ను ఒప్పించినందుకు భారత ప్రభుత్వ దౌత్య నీతిని అవే ఛానళ్లు వేనోళ్ల కొనియాడాయి. అంతవరకు బాగున్నది. అదే సమయంలో చెప్పుకోవలసింది మరొకటి ఉంది.

ట్యాంకర్లను ఇరాన్ అనుమతించటానికి కేవలం ఒక రోజు ముందు, భద్రతా మండలిలో గల్ఫ్ దేశాల కౌన్సిల్, ఇరాన్‌ను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఆ తీర్మానాన్ని భారతదేశం కేవలం బలపరచటంతో ఆగక ఒక అడుగు ముందుకు వేసి సహ ప్రతిపాదకురాలిగా (కోస్పాన్సరర్) వ్యవహరించింది. ఈ రెండు పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవు. ట్యాంకర్లను అనుమతించవలసిందిగా భారతదేశం ఇరాన్‌ను ఎపుడు కోరింది? అందుకు వారు ఎపుడు అనుమతించారు? ఆ రెండు నౌకలు హార్ముజ్ జలసంధిని ఎపుడు దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి? అన్నవి ఒక విధమైన ప్రశ్నలు. అంతకు ముందు రోజున భద్రతా మండలి తీర్మానానికి భారతదేశం ఎపుడు మద్దతు తెలిపింది? నౌకలను ఇరాన్ అనుమతించి అవి హార్ముజ్‌ను అప్పటికే దాటి బయటకు వచ్చాయా? అన్నవి మరొక విధమైనవి.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించినపుడు విషయం మరింత బాగా అర్థమయే మాట నిజమే. కాని ఈ లోపల యథాతధంగా అర్థమవుతున్నవి కూడా చాలానే ఉన్నాయి. భారతదేశం ఒకవైపు ఇరాన్‌ను భద్రతామండలిలో ఖండిస్తూ, మరొకవైపు చమురు ట్యాంకర్లుకు అనుమతి కోరింది. తనను ఖండిస్తున్నట్లు తెలిసి కూడా ఇరాన్ ట్యాంకర్లను అనుమతించింది. మోడీ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే ఇంగ్లీషు ఛానళ్లు, ట్యాంకర్లును సాధించిన మన దౌత్యనీతిని కొనియాడాయి గాని, ఆ ట్యాంకర్లను ఇంత క్లిష్ట స్థితిలోనూ అనుమతించిన ఇరాన్‌ను ప్రశంసించలేక పోయాయి. సమితి తీర్మానంలో ఏమున్నది? గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్‌పై ఖండనలున్నాయి. దాడులు వెంటనే నిలిపివేయాలనే డిమాండ్ ఉంది. హార్ముజ్ జలసంధిని మూసి వేయగలమని ఇరాన్ బెదిరిస్తున్నదంటూ విమర్శలున్నాయి. గల్ఫ్ దేశాల భౌగోలిక సమగ్రతకు, రాజకీయ స్వాతంత్య్రానికి సమర్థనలున్నాయి. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలకు, అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన ప్రమాదకరమనే హెచ్చరికలున్నాయి. ఆయా దేశాలకు అన్ని విధాలైన బెదిరింపులను, వారిని రెచ్చగొట్టడాన్ని నేరుగా ఇరాన్ గాని, వారి మిత్ర సంస్థలు గాని బేషరతుగా ఆపి వేయాలనే ప్రకటనలున్నాయి.

యథాతథంగా పశ్చిమాసియాలో శాంతి సాధనకు ఇవన్నీ అవసరమైన చర్యలే. కనుక ఆ మేరకు గల్ఫ్ దేశాలను గాని, ఆ తీర్మానాన్ని బలపరచిన ఇండియానుగాని, ఆ తీర్మాన సమావేశానికి అధ్యక్షత వహించిన అమెరికాను ప్రశంసించవలసిందే తప్ప ఆక్షేపించదగింది ఏమీ లేదు. కాని కొన్ని సందేహాలు ఆ తర్వాత మొదలవుతాయి. ఇంతకూ ప్రస్తుత సమస్య ఎందుకు తలెత్తింది? ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచానికంతా తెలుసు గనుక ఇక్కడ మళ్లీ చెప్పుకోవలసిని అవసరం నిజానికి లేనేలేదు. అయినా సందర్భం వచ్చింది గనుక చెప్పుకోక తప్పుదు. అమెరికా, ఇజ్రాయెల్‌లు పచ్చిఅబద్ధాలు చెప్తూ ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టినందున సమస్య మొదలైంది. వారు ఆరోపించినట్లు ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయటం లేదు. యురేనియం శుద్ధిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడే 60 శాతం వద్దనే ఆపివేసింది తప్ప, అణ్వాయుధాలకు కావలసిన 90 శాతానికి కాదు. ఆ పాటి కేంద్రాలను కూడా నిరుడు జూన్ నాటి దాడులలో అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేసాయి. భవిష్యత్తుకు సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమాన్ వెల్లడించింది.

ఇప్పటికే 60 శాతానికి శుద్ధి అయిన యురేనియం స్థాయిని అంతకన్న తక్కువ స్థాయికి తగ్గించగలమని ఇరాన్ చెప్పినట్లు ఒమన్ పేర్కొన్నది. ఇది ఒకటి కాగా, అణ్వస్త్రాలను అమెరికా వరకు 12,000 కి.మీ. మేర తీసుకుపోగల క్లిపణులు కూడా ఇరాన్‌కు లేవు. మరి ట్రంప్ ఆరోపిస్తున్నట్లు తమకు ఇరాన్‌తో ముప్పు ఎక్కడ? ఇక్కడ ఇంతింత చెప్పుకుంటున్నాము గాని వాస్తవానికి ఇవన్నీ, పైన అనుకున్నట్లు పలుమార్లు చెప్పుకున్నవే. ప్రపంచానికే గాక అమెరికా, ఇజ్రాయెల్‌లకు తెలిసినవే. అయినప్పటికీ నిరుడు జూన్‌లో ఇదే ప్రకారం దాడులు జరిపిన వారిద్దరూ ఇపుడు మరొకసారి అదే పని చేస్తున్నారు. ఇరాన్ అధినేత ఖమేనీ తోపాటు దాదాపు 40 మంది నాయకులను బలి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా నిరంతర విధ్వంసం సాగిస్తున్నారు. 175 మంది బడి పిల్లలను చంపారు. కొత్త నాయకునిగా ఎవరిని ఎన్నుకున్నా చంపివేస్తామంటున్నారు. తాము చెప్పిన వారినే ఎన్నుకోవాలంటున్నారు. ఇరాన్ రక్షణకు అవసరమైన క్షిపణి వ్యవస్థలను, క్షిపణులను, రివల్యూషనరీ గార్డ్ దళాలను నాశనం చేస్తామంటున్నారు. రాజకీయ వ్యవస్థను కూలదోసి అధికారం చేజిక్కించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తామంటున్నారు. అవసరమైతే ఇరాన్ దేశమన్నదే లేకుండా ఛిన్నాభిన్నం చేస్తామంటున్నారు. చమురు నిక్షేపాలన్నీ తమ అధీనంలోకి తెచ్చుకుంటామంటున్నారు.

ఇవన్నీ మనం చదువుతున్నవే. అయినప్పటికీ మరొకసారి గుర్తుచేసుకోవటం ఎందుకంటే, ఈ వివరాలను బుధవారం నాటి భద్రతామండలి తీర్మానంలోని అంశాలతో పోల్చి చూడవలసి ఉంది. అదే విధంగా, ఒకవైపు ఇరాన్‌పై జరుగుతున్న దుర్మార్గపు యుద్ధం పట్ల, మరొక వైపు ఇపుడు భద్రతామండలి తీర్మానం విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరించిన వైఖరుల గురించి చర్చించుకోవలసింది. తీర్మానం మరునాడు రెండు ట్యాంకర్లను ఇరాన్ అనుమతించటం అందుకు ముక్తాయింపు అవుతుంది. చివరకు మాట్లాడుకోవలసింది ప్రధానమంత్రి మోడీ ‘విశ్వగురుత్వం’ ఆయన ఆధ్వర్యాన భారతదేశం ‘గ్లోబల్ సౌత్’ అనబడే వర్ధమాన దేశాలకు నాయకత్వం వహించటం, విదేశాంగ విధానంలో ‘వ్యూహాత్మక తటస్థత’ (స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ) గురించి. ఇరాన్‌పై దాడిని, ఆ దేశాధినేత హత్యను, ఆ దేశ భౌగోళిక సమగ్రతకు, స్వాతంత్య్రానికి భంగం కలిగించగలమంటున్న అమెరికా, ఇజ్రాయెల్‌ల బాహాటపు ప్రకటనలను, సాగిస్తున్న విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం ఎన్నడూ మాట మాత్రంగానైనా ఖండించలేదు. పిల్లల హత్యపైనా నోరు విప్పలేదు. ఇంతకుముందు వెనిజులాపై దాడిని ఆ దేశాధినేతను భార్యతోసహా అపహరించటాన్ని కూడా.

ఇపుడు సమితి తీర్మానం విషయంలో కనీసం తటస్థతను పాటించటమైనా కాకుండా ఇరాన్‌ను ఖండించారు. హార్ముజ్ జలసంధి మూసివేత గాని, అమెరికన్ స్థావరాలు గల గల్ఫ్ దేశాలపైనే గాక టర్కీ, సైప్రస్ వంటి ఇతర దేశాలపై గాని దాడులు అక్కడి అమెరికన్ స్థావరాలను లక్షంగా చేసుకుంటున్నవే తప్ప ఆయా దేశాలను కాదు. ఆ మాట ఇరాన్ స్పష్టంగా చెప్తున్నది. ఆ మాట వారికి కూడా తెలుసు. అందువల్లనే తమ భూభాగంపై దాడులను ఇరాక్, సైప్రస్‌లోని తమ స్థావరంపై దాడిని బ్రిటన్ నిలువరించటానికే పరిమితమయాయి తప్ప ఇరాన్‌పై ఎదురు దాడులు చేయలేదు. పైగా, దాడులలో సహకరించాలన్న ట్రంప్ మాటకు బ్రిటన్ అంగీకరించలేదు. నిజానికి ఫ్రాన్స్, జర్మనీ తదితర నాటోదేశాలు కూడా విభేదించాయి. ఇరాన్ దాడులు గల్ఫ్‌దేశాల భౌగోళిక సమగ్రతకు, స్వాతంత్య్రానికి ముప్పు చేస్తున్నాయనే మాట కేవలం హాస్యాస్పదమైనది. నిజంగా అటువంటి ముప్పును ఎదుర్కొంటున్న ఇరాన్ సమస్య మోడీ ప్రభుత్వానికి లెక్కలోకి రాలేదు.

అదే విధమైనది గల్ఫ్‌పై దాడులు అంతర్జాతీయ చట్టాలకు, అంతర్జాతీయ శాంతిభద్రతలకు భంగకరమైనే మాట. ఇది నిజమే అనుకుందాం. మరి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ నిరుడు చేసిన దాడులు, ఇపుడు సాగిస్తున్న యుద్ధం అటువంటి చట్టాలకు, శాంతి భద్రతల పరిరక్షణకు అనుకూలమైనవా? ఆ విషయమై మోడీ ప్రభుత్వపు మౌనం ఎందువల్ల? ఇపుడు లేని ప్రమాదాన్ని ఊహించి చూస్తూ, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఆత్మరక్షణ దాడులను మాత్రమే ఇంత ఉత్సాహంగా ఖండించటమెందుకు? ఇంతకూ ఆ ప్రాంతాంలో అరడజనుకు పైగా అమెరికన్ స్థావరాలను గల్ఫ్‌దేశాలు ఎందుకు మోస్తున్నట్లు? వాటిని ఉపయోగించుకుని అమెరికన్లు ఇరాన్‌పై దాడులు చేయవచ్చుగాని, ఆ స్థావరాలపై ఇరాన్ ఎదురు దాడులు జరపరాదనడంలోని ఉద్దేశమేమిటి? సమితి తీర్మానంలో హార్ముజ్ జలసంధి మూసివేతనైతే మోడీ ప్రభుత్వం ఇతరులతో కలిసి ఖండించిందిగాని, ఇరాన్ ఆ చర్య తీసుకున్నది ఆత్మరక్షణ కోసమని తెలియదా? లేక వారికి ఆత్మరక్షణ హక్కు లేదని చెప్పదలచుకున్నారా? అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ బలి కావలసిందేదని చెప్పటం ఉద్దేశమా? ఇటువంటి ద్వంద్వ నీతిని, కపట ధోరణులను అనుసరించటం మోడీని ‘విశ్వగురువు’ చేయగలదా? ఇరాన్, వెనిజులా వంటి అనేకానేక వర్ధమాన దేశాలతోకూడిన ‘గ్లోబల్ సౌత్’ తనను నమ్మి నాయకత్వం అప్పగించగలదా? వేర్వేరు పెద్ద శక్తుల మధ్య ఎటూ మొగ్గకుండా ‘వ్యూహాత్మక తటస్థ’ విధానం ద్వారా దేశ ప్రయోజనాలను అన్ని విధాలు కాపాడుకోగలమన్న వారు, ఇటు ఇరాన్, అటు అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడి, ఇపుడు సమితి తీర్మానం విషయంలో అటువంటి తటస్థతను పాటించినట్లేనా?.

టంకశాల అశోక్