
టెహరాన్: ఇరాన్‌లోని టెహరాన్‌లో శుక్రవారం అత్యంత అరుదైన చూడముచ్చటైన పెళ్లి తంతు వేడుక జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల , భీకర పేలుళ్ల చప్పుళ్ల మధ్య ఓ జంట పెళ్లిచేసుకుంది. ఓ సైనిక స్థావరంలో మందుగుండు సామాగ్రి పెట్టెపై కూర్చుని ఉన్న నవ వధూవరులు చేతుల్లో తమ దేశ సైన్యానికి చెందిన రైఫిల్ష్ పట్టుకున్నారు. వారి పక్కన భారీ మెషిన్ గన్ అమర్చి ఉంచారు. చుట్టూ సాయుధులైన మద్దతుదార్లు నిలచి ఉండగా ఈ ఇద్దరూ పెళ్లినాటి ప్రమాణాలకు దిగారు.
యుద్ధాల సమయంలోనూ తమ దేశ ప్రజలు చెక్కుచెదరకుండా ఉంటారని, శత్రువును ధైర్యంగా ఎదుర్కొంటారని, తమ జనజీవితం విచ్ఛిన్నం కాకుండా సాగుతుందని చెప్పడానికి ఈ వినూత్న పెళ్లితంతు అసాధారణ రీతిలో జరిగింది. అమెరికా, మిత్రదేశాల యుద్ధ నేరాలకు ఈ జంట తగు విధంగా సవాలు విసరింది. ఇరానీయన్ల ఉక్కుసంకల్పాన్ని చాటింది. ఈ ఘట్టంలో ఎంతో ధైర్యంగా నిలిచిన పెళ్లి కూతురు నిజంగా వీరనారి అని ఓ ఇరానియన్ తన స్పందన వెలువరించారు. వెనుక విన్పించే బాంబుల మోతల మధ్య తాము వీరిని ఆశీర్వదించామని తెలిపారు.