
హైదరాబాద్: కేవలం పేదల ఇళ్లు కూల్చటం గురించి మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్నారని, ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలో రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు లేరు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..డబ్బులు లేవంటున్న సర్కార్ రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోందని, ఉద్యోగులకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్నారని, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా వేస్తామన్నారని..ఇప్పటివరకు లేదు అని హరీష్ రావు విమర్శించారు. కమీషన్ల కోసమే.. భారీ అంచనా వ్యయంతో మూసీ ప్రాజెక్టు అంటున్నారని, మూసీ ప్రాజెక్టు కోసం ఇప్పుడు 10 వేల ఇళ్లు కూలగొడతామని ఆర్డర్ ఇచ్చారని మండిపడ్డారు.
మూసీని శుద్ధి చేసేందుకు 3,279 ఎకరాల భూమి ఎందుకు? అని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని, తెలంగాణలోని బుల్డోజర్ పాలన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కనిపించటం లేదా? అని.. కనీసం డిపిఆర్ లేకుండా పేదల ఇళ్లు కూల్చడానికే ఎందుకు సిద్ధమయ్యారు? అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధం చేశారా..ప్రజల ముందు పెట్టాలని సూచించారు. డిపిఆర్ రూపొందించడానికి 18 నెలలు పడుతుందని 2 నెలల క్రితమే చెప్పారని అన్నారు. మూసీలో చేసేది బ్యూటిఫికేషనా.. లూటిఫికేషనా..? అని హరీష్ రావు ప్రశ్నించారు.