
ఐసిసి టి-20 ప్రపంచకప్-2026ని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంలో టీం ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెమీస్‌లో ఇంగ్లండ్‌పై, ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో బుమ్రా తమ జట్టులో ఉంటే.. తమ జట్టే ట్రోఫీని సొంతం చేసుకొనేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తాను చూసి బౌలర్లలో బుమ్రానే ది బెస్ట్ అని కితాబిచ్చాడు. బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచకప్ గెలిచేదని పేర్కొన్నాడు.
‘‘ఇంగ్లండ్ జట్టులో బుమ్రా ఉండుంటే.. తప్పకుండా వరల్డ్‌కప్ నెగ్గేదే. ప్రపంచ క్రీడాకారుల్లో బుమ్రాను లియోనిల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డోతో పోలుస్తా. ఏ టీమ్‌లో బుమ్రాను పెడితే ఆ జట్టుదే విజయం’’ అని వాన్ అభిప్రాయపడ్డాడు. దీనికి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లూయిడ్ స్పందిస్తూ.. ‘‘అంటే, మీరు చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమం అని చెబుతారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును. అతడే బెస్ట్ నేను 1985 నుంచి క్రికెట్ చూడటం, నేర్చుకోవడం మొదలైంది. ఇప్పటివరకూ నేను చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమం’’ అని వాన్ స్పష్టం చేశాడు.