
హైదరాబాద్: విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దుర్మార్గం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి, హరీష్ రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడానికి సిఎం రేవంత్ రెడ్డికు మనసు రావడం లేదని, ఎంతోమంది మనోవేవనకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే రేవంత్ రెడ్డికు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. బెనిఫిట్స్ అందక అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదని, మూసీ బ్యూటీఫికేషన్ కోసం, ఫ్యూచర్ సిటీ కోసం లక్షల కోట్లు, ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తారని అన్నారు.
తన సోకుల కోసం నిర్వహించే ఫుట్ బాల్ మ్యాచ్ కు 100 కోట్లు, వివిధ రాష్ట్రాల్లో పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్ది..బడా కాంట్రాక్టర్లకు రేవంత్ 40 వేల కోట్లు చెల్లించారు కానీ, ఉద్యోగులకు చెల్లించడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవని ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బకాయిలు చెల్లించేవరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని హెచ్చరించారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు.