
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హరోలాలో సెక్టార్ 4 సమీపంలోని ఓ కర్మాగారంలో ప్రమాదవశాత్తు గురువారం ఉదయం భారీ మంటలు సంభవించాయి. దీంతో పలువురు ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హరోలా ప్రాంతంలో ఉన్న ఒక పారిశ్రామిక యూనిట్‌లో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన నల్లటి పొగ వెలువడుతూ.. ఫ్యాక్టరీ పరిసరాలకు వ్యాపించింది. లోపలి నుండి కేకలు వేస్తున్న శబ్దాలు వినిపించడంతో భయాందోళనలు చెలరేగాయి. అనేక మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. 12 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాయి. లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 10 నుంచి 15 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.