Reading Time: < 1 minute

వాషింగ్టన్: ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చునని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ తో తమ యుద్ధం అనంతర పరిణామాల విశ్లేషణ క్రమంలో తమ ఆంతరంగిక సలహదారులతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. తరువాత వైట్‌హౌస్‌లో కిక్కిరిసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నల కు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. యుద్ధం ఆగిపోతుంది. అయి తే ఇది తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆగిపోవచ్చు. ఇప్పుడు తమ ముందు ఇరాన్ సంబంధిత టార్గెట్స్ ఏమీ మిగిలిలేవు. అక్కడి అగ్రనాయకత్వం పోయింది. రెండో శ్రేణి కథముగిసింది. ఇక తాము కొట్టడానికి మిగిలిదేమీ లేదని ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇక సరైన నాయకత్వంతో ముందుకు సాగుతుందని అనుకుంటానని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ సైనిక బలగాలు బాగా దెబ్బతిన్నాయని, వారు కోలుకోలేని రీతిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక యుద్ధం ముగుస్తుంది. త్వరలోనే ఆగిపోతుందని తెలిపారు. ఇజ్రాయెల్ బలగాలతో కలిసి అమెరికా సేనలు సాగించిన పోరులో ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీశామని వివరించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండవచ్చు. అయితే వారు పుంజుకోవడానికి మిగిలిందేమీ లేదన్నారు.

తాను ఎప్పుడు ఆపివేయాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ యుద్ధం స్వల్పకాలికమే అన్నారు. అయితే యుద్ధం ముగిసిందనే ట్రంప్ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ రెవెల్యూషనరీ గార్డ్ దళాలు ఇప్పుడు అమెరికా కీలక స్థావరాలను, ప్రత్యేకించి టెక్ సాధనసంపత్తిని దెబ్బతీసే క్రమంలో ఉన్నాయని తెలిపారు. తాము బలోపేతం అవుతున్న దశలోనే, అమెరికాలో ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగున్నదని, దీనితోనే ఆయన ఇప్పుడు ఓ డ్రామాగా ఈ మాటలకు దిగారని ఇరాన్ స్పందించింది. ఇప్పటికి సాగిన వార్ గొప్పగా ఉందని, తాము నిర్ణీత లక్షాలను కాలపరిమితికి ముందే చేరుకున్నామని , అనుకున్న దానికంటే ముందే శత్రువును దెబ్బతీయడం జరిగింది. ఇది అమెరికాకు గ్రేట్ వార్, అంతకు మించి గ్రేట్ ఫన్ అన్నారు. నిర్ణీత అంచనాల ప్రకారం ఆరు నెలలు యుద్ధం ఉంటుందనుకున్నానని, అయితే ముందే ఆగిపోయేలా ఉందని తెలిపారు. ఇరాన్‌ది విచ్ఛిన్నకర విధానం అని విమర్శించారు. ఇతర ప్రాంతాలపై అల్లరిచిల్లరిగా దాడికి దిగడం ద్వారా దశాబ్దాల తరబడి కోలుకులేని నష్టం కల్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.