Reading Time: < 1 minute

మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ చిత్రం మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ కామెంట్ వల్ల దర్శకుడు హరీశ్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. ఓ వ్యక్తికి ఆయన పెట్టిన కామెంట్ వల్ల సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానుల నుంచి ఆగ్రహాన్ని ఎదురుకున్నారు. అయితే ఆ కామెంట్‌పై ఆయన వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి పెట్టిన పోస్ట్‌ను మొత్తం చదవకుండానే కామెంట్ చేశానని.. ఒత్తిడి వల్లే అది జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు అభిమానులకు ఆయన క్షమాపణ చెప్పారు.

‘‘కొన్ని రోజులుగా పని ఒత్తిడిలో ఉన్నాను. సెన్సార్ పనులు, బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్ ప్రోమో ఫైనల్ చెక్ చేయడం.. ఇలా ఎంతో బిజీగా ఉన్నాను. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో సినిమా ప్రోమోపై వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్‌ీమడియాలో రిప్లైలు ఇస్తున్నాను. ఆ హడావుడిలో ఒక ట్వీట్ పూర్తిగా చదవకుండానే పోరపాటున కోట్ చేశాను. వెంటనే నా టీం అప్రమత్తం చేయడంతో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ రిప్లెని తొలగించాను’’

‘‘సూపర్‌స్టార్ మహేశ్ బాబు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ‘వారణాసి’ చిత్రంలో ఆయన మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నా. గతంలో ‘పోకిరి’ గురించి నేను పెట్టిన పోస్టులు చూస్తే.. మహేశ్‌పై నాకున్న అభిమానం అర్థమవుతుంది. ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బ తీయాలనే ఉధ్దేశం నాకు లేదు’’ అని తన లేఖలో హరీశ్ రాసుకొచ్చారు. సినిమా విడుదలకు మరో 10 రోజులు మాత్రం ఉన్న సమయంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకొనేంత అవివేకిని కాదని హరీశ్ పేర్కొన్నారు. అందరు హీరోల అభిమానులు ఆదరిస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుందని ఆయన అన్నారు. పొరపాటున తన వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని.. అందరూ పెద్ద మనస్సుతో అర్థం చేసుకొని ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను అదరించాలని విజ్ఞప్తి చేశారు.