Reading Time: < 1 minute

2026 ఐసిసి టి-20 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే కప్పును గెలిచిన సంతోషంలో భారత ఆటగాళ్లు హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట కోచ్ గౌతమ్ గంభీర్, ఐసిసి ఛైర్మన్ జై షా కూడా ఉన్నారు. అయితే ఈ పనిపై మాజీ క్రికెటర్, టిఎంసి ఎంపి కీర్తి ఆజాద్ విమర్శలు చేశారు. ట్రోఫీని కేవలం ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారు అని.. ఇతర మతల ప్రార్థన మందిరాలకు ఎందుకు తీసుకెళ్లలేదని అడిగారు. ఈ విమర్శలకు కోచ్ గౌతమ్ గంభీర్ ధీటుగా జవాబిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతో సొంత జట్టునే తక్కువ చేసుకుంటారా? అని ప్రశ్నించారు.

‘‘ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేంత విలువ లేదు. దేశం గర్వపడే క్షణాలు ఇవి. ఇలాంటప్పుడు అసంబద్ధ ప్రశ్నం వేయడం ఎంతవరకూ కరెక్ట్? మనం ప్రపంచకప్‌ని గెలిచాము. సంబరాలు చేసుకోవడం ముఖ్యం కానీ.. ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం వల్ల మనం సాధించిన లక్ష్యాన్ని తక్కువ చేసుకున్నట్లే అవుతుంది. 15 మంది ప్లేయర్లు కష్టపడి సాధించిన దానిని పక్కన పెట్టాలని భావిస్తున్నారా.? కుర్రాళ్లు సాధించిన దానిని వారికి ఇష్టమైన రీతిలో సెలబ్రేట్ చేసుకొని వెసులుబాటు కల్పించాలి. ఇందులో రాజకీయ, మతపరమైన విబేధాలు చూపించకూడదు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో తీవ్ర ఒత్తిడికి గురైన ప్లేయర్లు.. పుంజుకొని మరీ ఛాంపియన్‌లుగా మారారు. వారి కష్టాన్ని తక్కువ చేయవద్దు. ఇలాంటి వ్యాఖ్యలతో సొంత టీమ్‌నే డీగ్రేడ్ చేసిన వారవుతారు’’ అని గంభీర్ అన్నారు.