
ప్రభుత్వం కాళేశ్వరం 11వ ప్యాకేజీ ద్వారా అంసపూర్తిగా ఉన్న పనులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ మానేరు బ్రిడ్జిపై మండల రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బిజెపి జిల్లా అద్యక్షులు రెడ్డబోయిన గోపి రైతులకు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన ఆపేది లేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు ఆరగంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సిరిసిల్ల, సిద్దిపేట రహదారుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సిఐ నాగేశ్వర్‌రావు జిల్లా ఎస్‌పి మహేష్ బి గీతేకు పరిస్థితి వివరించారు. జిల్లా అద్యక్షులు గోపితో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు చేయవద్దని సూచించారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. తమ సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదంటూ బిజెపి నాయకులు, రైతులు ఆందోళన తీవ్రం చేశారు. పోలీసులు బిజెపి నాయకులను,
రైతులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలంలో 11వ ప్యాకేజి రంగనాయక సాగర్ కెనాల్ నిర్మాణ పనులకు రూ.3కోట్లు కేటాయించి పనులు చేపట్టకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. మండలంలోని 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ,స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కెనాల్ నిర్మాణం జరిగితే 10వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. నిధులు మంజూరైనా భూసేకరణ పనులు చేపట్టలేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అన్నారు. బిజెపి రైతు పోరాటాలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అద్యక్షులు రాగుల రాజిరెడ్డి,మండల బిజెపి అద్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు,సిరిసిల్ల వంశీ, కాళీచరణ్, రైతులు పాల్గొన్నారు.