Reading Time: < 1 minute

మ్యాచో స్టార్ టి.గోపీచంద్… విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ‘గోపీచంద్33’తో రాబోతున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రీతు వర్మ… టి.గోపిచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పాత్ర సత్యవతిని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. పోస్టర్‌లో రీతూ వర్మ కమాండింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. విల్లు ఎక్కుపెట్టి ఏకాగ్రతతో కనిపిస్తూ, ఒక యోధురాలిలా ధైర్యం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నారు. పీరియడ్ స్టైల్ దుస్తులు, సంప్రదాయ ఆభరణాలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్న లుక్ ఆమె పాత్రలోని పవర్ ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సినిమాలో రీతూ వర్మ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దంలో పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక గిరిజన తెగకు చెందిన మహిళగా ఆమె పాత్ర ఉంటుంది.

ఆ తెగ సంస్కృతి, ధైర్యం, సహనాన్ని ప్రతిబింబించేలా సత్యవతి పాత్ర రూపుదిద్దుకుంది. తన నటన ద్వారా రీతూ వర్మ ఆ పాత్రకు సహజత్వం, భావోద్వేగాలను తీసుకురానున్నారు. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయి ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. సృజనాత్మక కథనాలకు పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి, భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ సినిమాకు సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.