
రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే చివరిగా ఆయన నటించిన చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సింది. కానీ, అనుకోని అడ్డంకులు ఏర్పడి సినిమా విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కేసు కోర్టులో ఉంది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీ వీక్షించాలి. కానీ, కమిటీలో ఒక సభ్యుడు అనారోగ్యం కారణంగా సినిమా స్క్రీనింగ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
అన్ని సమస్యలు తీరితే సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామని భావించారు. కానీ, అది జరగలేదు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇంకా రివ్యూ కమిటీ వీక్షించి రిపోర్ట్ ఇస్తే.. సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుంది. కానీ, అది ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. దీంతో ఏప్రిల్‌లో కూడా సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు విజయ్ పుట్టిన రోజు నాడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో జూన్ 18న దీన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.