
ముంబై : బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగాల్సి ఉండగా, బీజేపీ నేతృత్వం లోని మహాయుతి కూటమి పలుస్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది. ఎన్నికలు లేకుండానే 68 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాయుతి భాగస్వాములైన బీజేపీ 44 సీట్లు గెల్చుకోగా, ఏకనాథ్ షిండే సారథ్యం లోని శివసేన 22 సీట్లు గెలుచుకుంది. 2 స్థానాలను అజిత్ పవార్ సారథ్యం లోని ఎన్‌సిపి దక్కించుకుంది.
కల్యాణ్ డోంబివ్లిలో 15 మంది బీజేపీ అభ్యర్థులు పోటీ లేకుండా గెలుపొందారు. బివాండి, పాన్వెల్, జలగావ్‌లో తలో 6 సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ధులేలో నలుగురు, అహిల్యానగర్‌లో ముగ్గురు అభ్యర్థులు గెలిచారు. పుణె, పింప్రిచించ్వాడ్‌ల్లో రెండేసి స్థానాలను ఆ పార్టీ పోటీ లేకుండా దక్కించుకుంది. థానేలో 7. కల్యాణ్‌డోంబివ్లిలో చెరో ఆరు స్థానాలను శివసేన గెలుచుకుంది. అహిల్యానగర్‌లో ఎన్‌సీపీ 2 సీట్లను సొంతం చేసుకుంది. మాలేగావ్‌లో స్థానిక ఇస్లామిక్ పార్టీ అభ్యర్థి కూడా పోటీ లేకుండా గెలిచాడు. పలుచోట్ల ఏకగ్రీవ విజయాలపై అధికార మహాయుతి ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కూటమి విజయభేరి మోగించింది.