
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ను ఉరి తీయాలని సిఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చానని అన్నారు. శాసనమండలి ఛైర్మన్ తో కవిత భేటీ అయ్యారు. ఉద్యమకారుడిని ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందని, రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదని.. రెండుసార్లు ఉరేయాలని విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కెసిఆర్ మాట్లాడి నోరు మూయించాలని, బిఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే కెసిఆర్ అసెంబ్లీకి రావాలని కవిత విజ్ఞప్తి చేశారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకులు మీద వదిలేయవద్దని, బిఆర్ఎస్ బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఆర్థికశాఖలో ఒక్క ఫైల్ 9 నెలలుగా పెండింగ్ లో ఉందని, ప్రభుత్వ చేతకానితనం కప్పిపుచ్చుకోవడానికి బిఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎపి నాయకులు శాశ్వతంగా తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని, ఆంధ్ర నేతలకు ఉన్న ఐక్యత తెలంగాణలో లేదని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, జిహెచ్ఎంసిలో డీలిమేషన్ సరిగ్గా జరగలేదని పేర్కొన్నారు. తనను పిలిస్తే సిట్ కు ఆధారాలు ఇస్తానని తెలియజేశారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ప్యాకేజీలు, అమ్ముడు తప్ప ఏం తెలుసు? అని కవిత ప్రశ్నించారు.